విషాదకెరటాలు గోదారమ్మ ఒడి... కన్నీటి జడి...

3 Aug, 2018 08:09 IST|Sakshi
రోడ్డు కమ్‌ రైలు బ్రిడ్జి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు (ఫైల్‌)

రోడ్డు కమ్‌ రైలు వంతెనపై పెరుగుతున్న ఆత్మహత్యలు

పర్యవేక్షణ ఉండాలంటున్న నిపుణులు

తూర్పుగోదావరి  ,రాజమహేంద్రవరం క్రైం: రోడ్డు–కమ్‌–రైలు వంతెన ఆత్మహత్యలకు నిలయంగా మారింది. క్షణికావేశంలో పలువురు ఇక్కడ నుంచి గోదావరి నదిలోకి దూకి ప్రాణాలు పోగోటుకుంటున్నారు. తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా... అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిండు ప్రాణాలకు నూరేళ్లు నిండిపోతున్నాయి.  పుష్కర ఘాట్‌లో కూడా ఆత్మహత్యలు, ప్రమాదాల వల్ల ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. సకాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి పోలీసులు, స్థానికులు రక్షించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు
ప్రేమికుల పెళ్లికి పెద్దలు నిరాకరించడం... క్రికెట్‌ బెట్టింగ్‌లో అప్పుల పాలై బుకీల వత్తిడి తట్టుకోలేక.. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై.. చదువులో వెనకపడామని విద్యార్థులు ఇలా అనేకనేక కారణాలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితంపై విరక్తి చెందిన వారు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత జూన్‌లో ఒక యువకుడు ఇంజినీరింగ్‌ వరకూ చదివి ఒక ప్రైవేటు కంపెనీలో ఎంపికై రోడ్డు కమ్‌ రైలు వంతెన పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబంలో నిరాదరణకు గురైన వృద్ధులు, మోసపోయిన యువతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులు సరేసరి
ధరలు పెరిగిపోవడంతో ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరగకపోవడంతో అనేకమంది మానసికంగా కుంగిపోతున్నారు. గతంలో ఏటా 10 శాతం ఖర్చులు పెరిగితే.. ప్రస్తుతం కుటుంబ పోషణకే విపరీతమైన ఖర్చు అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే సంసార జీవితంలో వారిమధ్య అవగాహన రాహిత్యం ఏర్పడి వచ్చే వివాదాలు కూడా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని వారు అంటున్నారు.పిల్లలకు భారం అయ్యామన్న వేదనతో వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆఫీసులలో వత్తిడిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయని వారు చెబుతున్నారు. సమస్యకు చావే పరిష్కారం కాదని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా చావే పరిష్కారం కాదని, ఆశావాద దృక్పథం అలవరుచుకుంటే ఆ సమస్య ఎప్పుటికైనా పరిష్కారమవుతుందంటున్నారు. ఇలాంటి వారికి కుటుంబ సభ్యులు భరోసా ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.

ఆత్మహత్యలకు రెండు కారణాలు..
ఆత్మహత్యలకు రెండు కారణాలు ఉంటాయని మానసిక నిపుణులు అంటున్నారు. కుటుంబంలోని కలహాలు, నిరాదరణ వల్ల.. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. గుర్తింపు లేదనో, లేక కుటుంబంలో తమను ఎవరూ లెక్క చేయడం లేదన్న భావనలో ఉన్న వారు ఉన్నారు. మెదడులోని కెరోటిన్‌ డాక్యుమెన్‌ అనే గ్రంధి వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని చెబుతున్నారు.

మూడేళ్లలోఆత్మహత్యల వివరాలు
2015లో గోదావరిలో 32 మంది మృతి చెందారు. వీరిలో 12 మంది ఆత్మహత్యలకు పాల్పడగా మిగిలిన వారు ప్రమాదవ శాత్తు మృతి చెందారు. 2016లో 31 మంది మృతి చెందగా 16 మంది వరకూ ఆత్మహత్యలు చేసుకున్నారు.మిగిలిన 15 మంది వివిధ ప్రమాదాల్లో మృతి చెందారు. 2017లో 39 మంది మృతి చెందగా వారిలో 14 మంది ఆత్మహత్య చేసుకోగా మిగిలిన 25 మంది వివిధ కారణాలతో మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 20 మంది వరకూ మృత్యువాత పడ్డారు. వీరిలో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఒంటరిగా ఉన్న వారి కదలికలపై దృష్టి పెట్టాలి
ఒంటరిగా ఉంటున్న వారిపై కుటుంబ సభ్యులు దృష్టి పెట్టాలి. సాధారణంగా వారిని కుటుంబ సభ్యులు పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఒంటరిగా ఉన్నవారి సమస్యలు అడిగి తెలుసుకుని ఆవి తీరే మార్గాలు అన్వేషించాలి. సమస్యను రేపైనా పరిష్కరించుకోవచ్చుననే భరోసాను కుటుంబ సభ్యులు కల్పించాలి. అప్పుడే మనోధైర్యంతో వారు ఆత్మహత్యలు చేసుకోవడం అనే అలోచన నుంచి బయటపడతారు.– డాక్డర్‌ హిప్నో కమలాకర్, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు

మరిన్ని వార్తలు