‘దెయ్యాల ’పేరుతో పూజలు 

23 Oct, 2019 13:16 IST|Sakshi

కడప నగరంలో భార్యాభర్తల వ్యవహారంపై కేసు నమోదు, అరెస్ట్‌  

రూ. 32 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాదీనం  

బాధితులు  ఫిర్యాదు చేయవచ్చు :కడప డీఎస్పీ 

కడప అర్బన్‌:  మీ ఇంటిలో ‘సైతాన్‌’ ఉంది... దాని వలన మీకు సక్రమంగా నిద్ర పట్టడంలేదు... మనశ్శాంతి లేకుండా పోతోంది..  మీ ఇంటిలో పూజలు చేయిస్తాం. సైతాన్‌  వెళ్లి పోతుందంటూ తమ బుట్టలో పడేవారిని ఎంపిక చేసుకుంటారు ఆ దంపతులు. తరువాత వారి ఇంటికి వెళ్లి పూజలను పూర్తి చేశాం. దెయ్యాన్ని సీసాలో బంధించాం. ఈ వ్యవహారంలో మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదు. దెయ్యాన్ని సీసాలో బంధించగానే మీ దగ్గరున్న బంగారు ఆభరణాలను మూటగా చేసి సీసాపై పెట్టండి. తరువాత ఇటువైపు రాకుండా ప్రార్థన చేసుకోండి. దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది. ఇందులో ఏ నిబంధన పాటించకపోయినా తీవ్రం గా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని  చెబుతారు. అంతే... ఎంచక్కా బంగారు ఆభరణాలను తమ వెంట తీసుకుని వెళ్లిపోతారు. ఇలా ప్రజలను బురిడీ కొట్టించే ఈ దంపతులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి.  కడప నగరంలోని మురాదియానగర్‌లో నివసిస్తున్న సయ్యద్‌షా జమలుల్లాబాషా, అతని భార్య సయ్యద్‌ నవీద సుల్తానా అలియాస్‌ ఫాతిమాలు తమ దగ్గరికి తాయెత్తులు కట్టుకునేందుకు వచ్చిన వారిలో తమ మాటలు నమ్మి తాము చెప్పిన విధంగా నడుచుకునేవారిని ఎంపిక చేసుకుంటారు. వారి ఇళ్లకు వెళ్లి పూజలు చేసి తర్వాత వారిని మోసం చేసి నగలతో ఎంచక్కా వెళ్లిపోతారు.   ఈ విధంగా మోసపోయిన వారిలో షేక్‌ ఆస్మా ఒకరు. తాను కట్టబోయే ఇంటి సమస్య ఉందని జమలుల్లాబాషా దంపతులను ఆశ్రయించింది. వారు ఆస్మా ఇంటికి వచ్చి  దెయ్యం ఉండటం వలన సమస్య ఉందని.. ఆ దెయ్యాన్ని సీసాలో బంధించామని .. అది బయటకు రావాలని ప్రయతి్నస్తోందని.. దానికి విరుగుడుగా బంగారంతో పూజ చేయాలని, లేకపోతే ప్రాణానికి ప్రమాదమని భయపెట్టారు. 

అలా చెప్పి సుమారు 221 గ్రాముల బంగారు ఆభరణాలతో ఉడాయించారు. అదే విధంగా కడపకు చెందిన రిజ్వానా నుంచి 60 గ్రాములు, షాజీదా నుంచి 88.5 గ్రాములు,  కదిరున్నీషా నుంచి 254 గ్రాములు , నూర్జహాన్‌ నుంచి 78 గ్రాములు, ఫర్జానా నుంచి 87 గ్రాములు మొత్తం సుమారు 790 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకుని వారిని మోసం చేశారు. బెంగుళూరుకు వెళ్లేందుకు ఆ దంపతులు సిద్ధం కాగా వారిని కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ పర్యవేక్షణలో కడప అర్బన్‌ సీఐ ఎస్‌ఎం ఆలీ, ఎస్‌ఐ పి. మంజునాథలు సిబ్బందితో కలసి చిలకలబావి వద్ద బస్సులో  మంగళవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 32 లక్షల విలువైన 790 గ్రాముల బంగారు ఆభరణాలను స్వా«దీనం చేసుకున్నారు.  

ప్రజలు మోసపోవద్దు : కడప డీఎస్పీ సూర్యనారాయణ  
పూజల పేరుతో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం కడప డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను హాజరు పరిచారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. ఇంకా ఎవరైనా వీరి నుంచి మోసానికి పాల్పడిన వారు తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.      

మరిన్ని వార్తలు