-

ఈ–సిగరెట్లనూ వదలట్లేదు!

10 Dec, 2018 09:26 IST|Sakshi

అక్రమంగా భారీ స్థాయిలో నిల్వ చేసి విక్రయం

గుట్టురట్టు చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తుంగలో తొక్కుతూ భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు నిల్వచేసి విక్రయానికి పాల్పడుతున్న వైనాన్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని అరెస్టు చేసి రూ.7 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. పరారీలో ఉన్న దుకాణ యజమానితో సహా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఖైరతాబాద్‌ ప్రాంతానికి చెందిన కేకే నారాయణరెడ్డి వాప్‌ ఎసెన్షియల్స్‌ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు.

ఇందులో బాలకృష్ణ, చెరుకూరి ఆదిత్య ఉద్యోగులుగా ఉన్నారు. నారాయణరెడ్డి భారీ స్థాయిలో ఈ–సిగరెట్లు, ద్రవరూపంలో ఉండే వివిధ రకాలైన పొగాకు ఫ్లేవర్లు సమీకరించి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం వలపన్ని ఆదివారం దాడి చేసింది. బాలకృష్ణను అదుపులోకి తీసుకుని రూ.7 లక్షలు విలువైన ఈ–సిగరెట్లు తదితరాలు స్వాధీనం చేసుకుంది. కేసును సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తోంది. ఈ–సిగరెట్లు సైతం ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో హాని చేస్తాయని పోలీసులు చెప్తున్నారు. 

మరిన్ని వార్తలు