టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్‌ సీపీ నేత కారు దగ్ధం

25 Feb, 2019 11:29 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలో కొందరు టీడీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడికి చెందిన కారును తగలబెట్టి పైశాచికానందం పొందారు. ఈ సంఘటన ఆదివారం కొండాపురం మండలం ఏటూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి అల్లం సత్యం ఆదివారం ‘కావాలి జగన్‌ రావాలి జగన్‌’ కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఇంటికి బయలు దేరారు. ఏటూరు గ్రామం వద్ద కారు పంక్షర్‌ అయింది. కారులో స్టెఫినీ లేనందున టైరు పంక్చర్‌ వేయించటానికి ఆయన పక్క ఊరు వెళ్లిన సమయంలో కొందరు టీడీపీ నేతలు కారును దగ్ధం చేశారు.

ఈ సంఘటనపై అల్లం సత్యం మాట్లాడుతూ.. తనను దహనం చేసినప్పటికి పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా, సుధీర్‌ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసేంత వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా పార్టీని వీడే ప్రసక్తే లేదని, బతికున్నంత కాలం వైఎస్సార్‌ అభిమానులుగానే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు.

కారు దగ్ధం ఘటనపై సుధీర్‌ రెడ్డి ఫైర్‌ 
వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి అల్లం సత్యం కారు దహనం ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇద్దరు ఫ్యాక్షన్ నాయకులు ఏకమై తమ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నట్లు తెలిపారు. ఏజెంటుగా కూర్చుంటాను అన్నందుకే అల్లం సత్యం కారును తగులబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో జమ్మలమడుగులో ఎలాంటి పరిస్థితి ఉందో స్పష్టమవుతోందన్నారు. టీడీపీ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరన్నారు. కారు దహనం చేస్తే స్థానిక పోలీసులు తమకు తెలియదంటున్నారని చెప్పారు. ఈ సంఘటనను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. జమ్మలమడుగు పరిస్థితులపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు