బాలికపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

25 Feb, 2019 08:02 IST|Sakshi
కీచక టీచర్‌ను సస్పెండ్‌ చేయాలని ఎంఈఓకు ఫిర్యాదు చేస్తున్న గ్రామస్తులు

కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

చర్యలు తీసుకుంటామని ఎంఈవో హామీ

తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన ప్రజలు ఆ పాఠశాలకు చేరుకుని, కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఆందోళన నిర్వహించారు. కిర్లంపూడి మండలం ఎస్‌.తిమ్మాపురం ఎంపీపీ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు తాటికొండ గణేశ్వరరావు ఆరో తరగతి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ, ఆ బాలిక తల్లిదండ్రులతోపాటు పలువురు గ్రామస్తులు ఆందోళన చేశారు. పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. నిందితుడైన ఉపాధ్యాయుడు పరారవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రధానోపాధ్యాయుడు అడపా సత్యనారాయణను పాఠశాలలో నిర్బంధించారు.

గతంలో రెండుమూడుసార్లు ఇటువంటి సంఘటనలు జరిగినా ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. కీచక ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్‌ చేయాలని, ప్రధానోపాధ్యాయుడిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ టి.జోసెఫ్, ఎస్సై జి.నరేష్‌లు ఎస్‌.తిమ్మాపురం పాఠశాలకు చేరుకుని విషయాన్ని ఆరా తీశారు. బాధిత బాలిక నుంచి, ఆమె తల్లిదండ్రుల నుంచి ఎంఈఓ రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. కీచక ఉపాధ్యాయునిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారికి సిఫారసు చేయనున్నామని తెలిపారు. ఆందోళనలో గ్రామస్తులు గొల్లపల్లి చక్రధర్, బొజ్జపు శ్రీను, ఎం.బాబ్జీ, విద్యాకమిటీ చైర్మన్‌ గొల్లపల్లి ప్రసాద్, గొల్లపల్లి సత్యనారాయణ, సోము నారాయణరావు, దాసు, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు