ప్రాణాల మీదికి తెచ్చిన అయ్యోరి వడ్డీ వ్యాపారం

25 Oct, 2023 01:22 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రప్ప

పలమనేరు: ఓ ఉపాధ్యాయుడి వడ్డీ వ్యాపారం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది. సోమవారం సాయంత్రం పట్టణ సమీపంలోని సాయినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బైరెడ్డిపల్లి మండలం మిట్టకురప్పల్లెకు చెందిన చంద్రప్ప(33) గ్రామంలో తన 53 సెంట్ల పొలంలో సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. మూడేళ్ల కిందట చంద్రప్ప భార్య అనారోగ్యానికి గురికావడంతో మిట్టకురప్పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేసే తమ బంధువైన కృష్ణమూర్తి వద్ద తన పొలాన్ని రాసిచ్చి రూ.2 లక్షలను వడ్డీకి తీసుకున్నాడు.

ఆపై తీసుకొన్న అప్పు వడ్డీతో కలసి రూ.4లక్షల వరకు పెరిగింది. ఆ డబ్బు మొత్తం చెల్లిస్తే తిరిగి భూమి వెనక్కి రాసిస్తానని టీచర్‌ చెప్పాడు. దీంతో బాధితుడు రెండేళ్లుగా డబ్బు కడుతానంటూ టీచర్‌ వద్దకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీంతో సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లెలో క్రిమిసంహార మందును వెంటబెట్టుకుని స్థానిక సాయినగర్‌లోని టీచర్‌ ఇంటివద్దకెళ్లి వడ్డీతో కలసి మొత్తం డబ్బు చెల్లిస్తానని, తన భూమి తనకు రిజిస్ట్రర్‌ చేసివ్వాలని ప్రాధేయపడ్డాడు.

ససేమినా కాదని ఆయన చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు వెంట తెచ్చుకున్న క్రిమిసంహారకమందును సేవించి అక్కడే అపస్మారక స్థితిలోకెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు 108 ద్వారా అతన్ని పలమనేరు ప్రభు త్వాస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వైద్యులు తిరుపతి రుయాకు తరలించారు. ప్రస్తుతం బాధితుని పరిస్థితి విషమంగా ఉందని, అతని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు