నా భార్యది ఆత్మహత్య కాదు.. ఇదిగో వినండి.. వాయిస్ రికార్డ్!

17 Oct, 2023 11:32 IST|Sakshi

చెరువులో దూకి అధ్యాపకురాలి బలవన్మరణం..

చెన్నూర్‌లో కలకలం రేపిన ఘటన!

ప్రిన్సిపాల్‌ వేధింపులే కారణమని బంధువుల ఆందోళన..

సెల్‌ఫోన్‌లో వాయిస్‌ రికార్డు..

సాక్షి, కుమురం భీం: చెరువులో దూకి అధ్యాపకురాలు బలవన్మరణం చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ వాసుదేవరావు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్‌ మండలానికి చెందిన పసునూటి తిరుమలేశ్వరి (32) చెన్నూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం విధుల్లో భాగంగా కళాశాలకు వెళ్లి రిజిష్టర్‌లో సంతకం చేసింది.

అనంతరం బయటకు వెళ్తుండగా తొటి ఉపాధ్యాయురాలు ప్రశ్నించడంతో సెల్‌ఫోన్‌ మర్చిపోయాను.. ఇంటికి వెళ్లివస్తానని చెప్పింది. 10 గంటల ప్రాంతంలో పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త సంపత్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీయించి పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కీలకంగా మారిన వాయిస్‌ రికార్డు..
ఆత్మహత్యకు ముందు తిరుమలేశ్వరి తన మృతికి కళాశాల ప్రిన్సిపాల్, ఏటీసీ, పీఈటీతో పాటు మరో ఉపాధ్యాయురాలు కారణమని సెల్‌ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేసింది. ఇదే కేసులో కీలకంగా మారింది. వాయిస్‌ రికార్డు ఆధారంగా మృతురాలి భర్త సంపత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు.

బంధువుల ఆందోళన!
మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు కుమారస్వామి, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి గురుకుల కళాశాల అధికారులు వచ్చే వరకు పోస్ట్‌మార్టం చేయవద్దని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఆర్సీవో స్వరూపారాణి వచ్చి మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమలేశ్వరి ఉద్యోగాన్ని భర్త సంపత్‌కు ఇస్తామని, ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్‌ కుమార్తె పేరున అందజేస్తామని రాసివ్వడంతో ఆందోళన విరమించారు.

ప్రిన్సిపాల్, ఏసీటీ, మరో ముగ్గురిపై కేసు నమోదు..
అధ్యాపకురాలి మృతి కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమలేశ్వరి ఉద్యోగ రీత్యా చెన్నూర్‌లోని ఆదర్శనగర్‌లో నివాసం ఉంటోంది. నాలుగేళ్లుగా గురుకుల కళాశాల లెక్చరర్‌తో పాటు మెస్‌ కేర్‌టేకర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కొన్ని రోజులుగా ప్రిన్సిపాల్‌ రాజమణి, ఏసీటీ స్రవంతి, పీఈటీలు రేష్మ, శిరీష, మరో ఉపాధ్యాయురాలు పుష్పలత వేధింపులకు గురిచేస్తున్నారని మృతురాలి భర్త సంపత్‌ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు