మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు

18 Jun, 2019 05:17 IST|Sakshi
ప్రకాశం జిల్లా కొత్తపేటలోని మృతురాలు లావణ్య తండ్రి సీతారామిరెడ్డి ఇల్లు

శవపరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్న అమెరికా పోలీసులు

మృతుడిది గుంటూరు జిల్లా, మృతురాలిది ప్రకాశం జిల్లా..

చీరాల/ వాషింగ్టన్‌: అమెరికాలో శనివారం ఉదయం అనుమానాస్పదరీతిలో మృతి చెందిన నలుగురు తెలుగు వ్యక్తుల (ఒకే కుటుంబం) మరణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. శవపరీక్ష పూర్తి అయిన తర్వాత వారి మరణానికి గల పూర్తి వివరాలు తెలియవచ్చే అవకాశం ఉందని సోమవారం అమెరికా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని వారు తెలిపారు. అమెరికాలోని తెలుగు వారికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్నారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్‌డెస్‌ మోయిన్స్‌లో యాష్‌వర్త్‌ రోడ్డు– అస్పెన్‌ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65వ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి (44), ఆయన భార్య లావణ్య (41), కుమారులు ప్రభాస్‌ (15), సుహాన్‌ (10)లు శనివారం తుపాకీ తూటాల గాయాలతో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 

మృతులు.. ప్రకాశం, గుంటూరు జిల్లావాసులు
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీకి చెందిన సీతారామిరెడ్డి తన పెద్ద కుమార్తె లావణ్యను గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందిన సుంకర చంద్రశేఖరరెడ్డికి ఇచ్చి 2003లో చీరాలలో వివాహం చేశారు. చంద్రశేఖరరెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, లావణ్య కూడా అమెరికన్‌ గవర్నమెంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత మే 29న వారు ఓ ఇంటిని కొనుగోలు చేయగా చంద్రశేఖరరెడ్డి అత్తమామలైన సీతారామిరెడ్డి, హైమావతిలు గృహప్రవేశం నిమిత్తం అమెరికా వెళ్లారు. శనివారం ఇంట్లో తుపాకీ పేలిన శబ్ధం రావడంతో కింద పోర్షన్‌లో ఉంటున్న లావణ్య చెల్లెలు పిల్లలు ఇద్దరు పైకి వెళ్లి చూశారు.

రక్తపుమడుగుల్లో పడి ఉన్న నలుగురిని చూసి బయటకు వచ్చి స్థానికుల సహాయం కోరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడకు చేరుకునే సరికి రక్తపుమడుగులో నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన ఇద్దరు పిల్లలు ప్రభాస్, సుహాన్‌ చదువులోగాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేవారని చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబంతో అమెరికాలో పదేళ్లుగా పరిచయం ఉన్న శ్రీకర్‌ సోమయాజులు తెలిపారు.  

మరిన్ని వార్తలు