జైలుశిక్ష భయంతో యువకుడి ఆత్మహత్య

16 Mar, 2020 10:29 IST|Sakshi
ఎస్‌.మహేంద్ర, గాయత్రిదేవి (ఫైల్‌)

ముషీరాబాద్‌: శిక్షపడితే జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాంనగర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్‌ డివిజన్‌ కృష్ణానగర్‌కు చెందిన ఎస్‌.మహేంద్ర(20) వాటర్‌క్యాన్‌ సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి లేకపోవడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. గత ఏడాది కృష్ణానగర్‌ బస్తీకి చెందిన ఓ అమ్మాయి తనను వేధిస్తున్నాడని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. కేసుకు సంబంధించిన ట్రయల్‌ వచ్చే నెల ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభం కానుంది. కేసు నిరూపణ అయితే 7 నుంచి 14 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉందని ప్రచారం కావడంతో ఆందోళన చెందిన మహేంద్ర శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌ కొక్కేనికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతోనే మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడినట్లు బస్తీ అధ్యక్షుడు కాదాసి నర్సింగ్‌రావు తెలిపారు.  

కేపీహెచ్‌బీకాలనీ: పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్‌పటేల్‌ నగర్‌కు చెందిన కావూరి శ్రీనివాస్‌ కూతురు మెహర్‌ గాయత్రి దేవి (14) పదోతరగతి చదువుతోంది. శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ తన కుమార్తె బెడ్రూంలోంచి బయటకు రాకపోవటంతో తలుపులను బలవంతంగా తెరిచి చూసేసరికి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. 

మరిన్ని వార్తలు