పదిలోనే బరితెగింపు

28 Jan, 2020 07:11 IST|Sakshi

క్లాస్‌మేట్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు

సహ విద్యార్థినికి అసభ్యకర సందేశాలు

తల్లిదండ్రులకు చెందిన ఫోన్లు వాడిన వైనం

నోటీసులు జారీ చేసిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: మైనర్ల చేతికి తమ స్మార్ట్‌ఫోన్లు అందేలా చేస్తున్న తల్లిదండ్రులు వారి వ్యవహారాలను, కార్యకలాపాలను అసలు పట్టించుకోవట్లేదు. ఫలితంగా అనేక సోషల్‌మీడియా యాప్స్‌ను విరివిగా వినియోగిస్తున్న బాలబాలికలు ఒక్కోసారి బరితెగిస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో అభ్యంతరకరమైన పనులు చేస్తూ సైబర్‌ క్రైమ్‌ ఠాణాల వరకు వస్తున్నారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఈ తరహా ఉదంతం ఒకటి సోమవారం వెలుగు చూసింది. తన క్లాస్‌మేట్‌ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా సృష్టించి, తమ సహ విద్యార్థినికి అసభ్య సందేశాలు పంపిస్తూ ఓ టెన్త్‌క్లాస్‌ విద్యార్థి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ విషయం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వరకు చేరడంతో అధికారులు నిందితుడికి, అతడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, నోటీసులు జారీ చేసి పంపారు. నగరంలోని రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.

నిత్యం తన తల్లిదండ్రులకు చెందిన స్మార్ట్‌ఫోన్లు ఇతడికి అందుబాటులో ఉండేవి. దీంతో తన క్లాస్‌మేట్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లి ఫోన్, తండ్రి ఫోన్లలో వేర్వేరుగా నకిలీ ఖాతాలు తెరిచాడు. అంతటితో ఆగకుండా వీటి ద్వారానే తన సహ విద్యార్థిని ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాకు అభ్యంతరకర సందేశాలు పంపడం మొదలెట్టాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు తొలుత ఆ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు ఎవరి పేరున ఉన్నాయో ఆ విద్యార్థిని నిలదీశారు. అతడి తల్లిదండ్రులకూ విషయం చెప్పారు. తాను ఆ పని చేయలేదని, తన పేరుతో తెరిచిన ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలు వినియోగించి ఎవరో ఇలా చేస్తున్నారని చెప్పాడు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు రెండు ఫోన్‌నంబర్ల ఆధారంగా పని చేస్తున్నట్లు తేలింది. అవి ఎవరివని ఆరా తీయగా దంపతులకు చెందినవిగా వెలుగులోకి వచ్చింది. వారి కుమారుడు ఈ బాలికతోనే విద్యనభ్యసిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులతో సహా సదరు మైనర్‌నూ సోమవారం ఠాణాకు పిలిచిపించారు. పోలీసుల సమక్షంతో అతడి తల్లిదండ్రులు మందలించడంతో అది తన పనేనంటూ అంగీకరించాడు. ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులకూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆపై సదరు మైనర్‌కు నోటీసులు జారీ చేసిన అధికారులు ఇలాంటివి పునరావృతం కానీయొద్దంటూ

అవగాహన కల్పించి
పంపారు. స్మార్ట్‌ఫోన్లు చిన్నారులకు అందేలా ఉంచడం లేదా వారికోసమే ప్రత్యేకంగా ఖరీదు చేసి ఇవ్వడం ఇటీవల కాలంలో పెరిగిందని, ఆ ఫోన్ల ద్వారా పిల్లల కార్యకలాపాలను తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని పోలీసులు చెబుతున్నారు. వీరంతా తమ పిల్లలు ఆ ఫోన్లలో గేమ్స్‌ ఆడుకుంటున్నట్లు భావిస్తున్నారని, అయితే కొందరు దీన్నే అలుసుగా తీసుకుని పెడదారి పడుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు