రూ.20 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాహ..

23 Aug, 2019 12:32 IST|Sakshi
వేలిముద్రలు సేకరిస్తు్తన్న క్లూస్‌ టీమ్‌ 

సాక్షి, పశ్చిమగోదావరి(పెదపాడు) : జ్యూయలరీ షాపు గోడకు కన్నం పెట్టి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు దోచుకుపోయిన సంఘటన పెదపాడు మండల పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు మండలంలోని అప్పనవీడులో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఆంజనేయ జ్యూయలరీ షాపు యజమాని బుధవారం రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూసివేసి బాపులపాడులోని ఇందిరానగర్‌లోని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 9 గంటల సమయంలో పక్కనే ఉన్న బేకరీ యజమాని ఫోన్‌ చేసి మీషాపు గోడ రంద్రం పెట్టి ఉన్నట్లు జ్యూయలరీ షాపు యజమానికి తెలియజేశాడు.

దీంతో షాపు తెరచి చూడగా షాపులోని చెవి దుద్దులు, జుంకాలు, పాపిడి బిల్లలు, మేటీలు ఇతర బంగారు వస్తువులతో పాటు 250 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో పెదపాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పెదపాడు పోలీసులు అక్కడకు చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో క్లూస్‌ టీమ్‌ సహాయంతో వేలిముద్రలు సేకరణ చేసారు. షాపు యజమాని బొల్లంకి అప్పారావు  ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సైజీ జ్యోతి బసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు