ముగ్గురు రైతుల ఆత్మహత్య 

29 Oct, 2017 03:02 IST|Sakshi

పర్వతగిరి/గణపురం/పాల్వంచ రూరల్‌: అప్పుల బాధతో వేర్వేరుచోట్ల ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకి చెందిన రైతు దొమ్మటి ఎల్లయ్య (52) కల్లుగీత వృత్తితోపాటు వ్యవసాయం చేస్తున్నాడు. తన రెండెకరాల భూమి లో వరి, ఐదెకరాల అన్నదమ్ముల పొత్తుల భూమిలో పత్తి సాగు చేశారు.  పెట్టుబడుల కోసం చేసిన రూ.3.80 లక్షల అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మనోవేదనకు గురైన ఎల్లయ్య శుక్రవారం ఇంటి నుంచి వెళ్లాడు. శనివారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా ఊరి బయట చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాకకి  చెందిన గుర్రం ఐలయ్య (30) రెండేళ్లుగా తనకున్న 20 గుంటల భూమితోపాటు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యాడు. ఈ ఏడాది మరో రూ. 50 వేలు అప్పు అయింది. నాలుగు రోజులుగా దిగాలుగా ఉన్న ఐలయ్య శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైల్‌కి చెందిన బుడగం లక్ష్మణ్‌రావు (46) తనకున్న ఐదెకరాల్లో పత్తిసాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ. 2 లక్షలు అప్పు చేశాడు.

అప్పు చెల్లించాలని వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేయడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పత్తి చేనులో పురుగుమందు తాగాడు.  మహబూబాబాద్‌ మండలం ఈదులపూసపల్లి గ్రామ శివారు దర్గాతండాకు చెందిన కౌలు రైతు లకావత్‌ హచ్చు(43) మిరప తోటలో పనిచేస్తుండగా గుండెపోటుతో మృతిచెందాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.   

మరిన్ని వార్తలు