ఎస్సీ ఎస్టీ కేసు పేరుతో రూ.15లక్షలు వసూలు

12 Jun, 2018 13:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎస్సీ,ఎస్టీ చట్టం పేరుతో అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సోమజిగూడలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో రమేష్, సంజీవ కుమార్, కిరణ్‌ అనే ముగ్గురు కొద్ది కాలం క్రితం పనిలో చేరారు. అయితే వీరి పనితీరు నచ్చని యజమాని శ్రీనివాస్‌, పనిలో నుంచి తప్పిస్తానని హెచ్చరించాడు. దీంతో  యజమానిపై కోపం పెంచుకున్న ముగ్గురు ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. 

అంతేకాకుండా యజమాని నుంచి ఒక చెక్, ప్రామిసరి నోటు తీసుకొన్నారు. కేసు పేరుతో దాదాపు పదిహేను లక్షల రూపాయలకు పైగా శ్రీనివాస్‌ నుంచి వసూలు చేశారు. అయితే వీరి వేధింపులను కొద్ది కాలం పాటు భరించిన యజమాని.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఎల్బీ నగర్‌ పోలీసులు ముగ్గరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కొద్ది మొత్తంలో డబ్బు, ప్రామిసరి నోటు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎవరైన ఇలాంటి చీటింగ్, బెదిరింపులకు పాల్పడితే 9490617111 ద్వారా తమను సంప్రదించవచ్చని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

మరిన్ని వార్తలు