విద్యుదాఘాతానికి ముగ్గురు బలి

2 May, 2019 10:39 IST|Sakshi

అనంతపురం, తాడిమర్రి: జిల్లాలో వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక రైతు, ఒక పెయింటర్, ఒక యువకుడు ఉన్నారు. వివరాల్లోకెళ్తే... తాడిమర్రి మండలం పెద్దకోట్లకు చెందిన రైతు వెంకటనారాయణ (68)కు ఐదు ఎకరాల పొలం ఉంది. ఒక ఎకరాలో వరి సాగు చేశాడు. ప్రతి రోజులాగే బుధవారం ఉదయం 8 గంటల సమయంలో వరిమడికి నీరు పెట్టడానికి వెళ్లాడు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మోటర్‌ పెట్టె తడవటంతో స్విచ్‌కు విద్యుత్‌ సరఫరా అయ్యింది. ఇది తెలియని రైతు మోటర్‌ ఆన్‌ చేయడానికి స్విచ్‌ను తాకగానే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి భార్య నారాయణమ్మ, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్‌ఐ శరత్‌చంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.  

గోరంట్లలో  పెయింటర్‌..  
గోరంట్ల: గోరంట్ల పట్టణానికి చెందిన ఓ పెయింటర్‌ విద్యుదాఘాతంతో చనిపోయాడు. సీఐ ధరణీకిషోర్‌ తెలిపిన మేరకు... పట్టణంలోని వినాయకనగర్‌కు చెందిన నవీన్‌ భరద్వాజ్‌ (29) బుధవారం దసిరెడ్డిపల్లి తండాకు చెందిన రామ్లానాయక్‌ ఇంటి బయట గోడలకు  పెయింట్‌ కొడుతున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు చేయి తగలటంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతడిని గ్రామస్తులు గోరంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణం విడిచాడు. ఇతడికి భార్య, కుమారుడు ఉన్నారు. 

తూమకుంట ఎస్సీ కాలనీలో మరొకరు..  
హిందూపురం : తూమకుంట ఎస్సీకాలనీకి చెందిన నరసింహమూర్తి (23) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి గాలీవానకు చాలాచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడిపోయాయి. బుధవారం మధ్యాహ్నం రాకపోకలకు ఇబ్బందిగా ఉందని తీగలను పక్కకు తొలగిద్దామని ప్రయత్నించాడు. విద్యుదాఘాతానికి గురై గట్టిగా కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చూడగా.. అప్పటికే నరసింహమూర్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌ తీగలు తగలిమహిళకు గాయాలు
నార్పల: కేశేపల్లిలో నివాసముంటున్న కళావతి బుధవారం ఉదయం కూలి పనులకు వెళ్తుండగా తలకు విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురైంది. గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు