డ్రైవర్‌ను సస్పెన్షన్‌ చేసిన ఆర్టీసీ అధికారులు.. దీనితో డ్రైవర్‌ తీవ్రనిర్ణయం..

4 Nov, 2023 10:58 IST|Sakshi

గోపాల్‌పేట: ఉరేసుకుని ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. తాడిపర్తికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్‌ (52) కొన్నేళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. నాలుగు నెలల కిందట ఆర్టీసీ అధికారులు చంద్రశేఖర్‌గౌడ్‌ను సస్పెన్షన్‌ చేశారు. అప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ సభ్యులు అతడిపై కోపంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

విద్యుదాఘాతంతో ‘భగీరథ’ లైన్‌మేన్‌ మృతి
గోపాల్‌పేట: విద్యుదాఘాతంతో మిషన్‌ భగీరథ పథకం లైన్‌మేన్‌ మృతి చెందిన ఘటన గోపాల్‌పేట మండలం తాడిపర్తిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తాడిపర్తిలో మిషన్‌ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌ లీకేజీ అయింది. పైప్‌లైన్‌కు మరమ్మతు చేసేందుకుగాను కాశీంనగర్‌కు చెందిన వాటర్‌మేన్‌ సతీష్‌ (45) వెల్డింగ్‌ మిషన్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష
చిన్నచింతకుంట: పోక్సో కేసులో నిందితుడికి మహబూబ్‌నగర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. చిన్నచింతకుంట మండలం లాల్‌కోటకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పోగుల రాజుపై 2018లో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఎస్‌ఐ శేఖర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు