పంచాయతీ ఎన్నికల్లో విషాదం 

31 Jan, 2019 01:44 IST|Sakshi

విధి నిర్వహణలో గుండెపోటుతో వీఆర్‌వో మృతి

పరిగి మండలంలో పోలింగ్‌ కేంద్రంలోనే మహిళ మృతి  

దౌల్తాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో విషాదం చోటుచేసుకుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. బుధవారం వికారాబాద్‌ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ఉన్న వీఆర్‌వో, ఓటేసి వెళ్తూ ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌ మండలం చంద్రకల్‌ గ్రామానికి చెందిన నర్సప్ప (50) కోస్గి మండలం ముశ్రీఫా వీఆర్‌ఓగా పనిచేస్తున్నారు. బుధవారం తుదివిడత పంచాయతీ ఎన్నికల కోసం.. కోస్గి మండలం ముశ్రీఫా గ్రామానికి వెళ్లాడు.

విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో నర్సప్ప కిందపడిపోయాడు. స్థానికులు గమనించి కోస్గి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నర్సప్ప మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య అరుణమ్మ ఇటీవల చంద్రకల్‌ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 
మరో ఘటనలో ఓటరు 
పరిగి మండలం మిట్టకోడూర్‌ గ్రామానికి చెందిన కోరె వెంకటమ్మ (65) బుధవారం పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలింగ్‌ కేంద్రానికి వచ్చింది. ఓటేసేందుకు వరుసలో నిల్చుని ఉంది. ఓటేసిన వెంటనే వెంకటమ్మకు గుండెపోటు రావడంతో ఆమె పోలింగ్‌ కేంద్రంలోనే కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు స్పందించి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. పరిశీలించిన స్థానిక వైద్యులు ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు