ప్రాణాలు తీసిన మామిడి కాయలు

29 May, 2019 10:55 IST|Sakshi

అశ్వారావుపేట రూరల్‌: మామిడి కాయలు కోసేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వేర్వే ప్రాంతాల్లో మృతి చెందిన విషాద  ఘటన అశ్వారావుపేట మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఒకరు కాయలు కోస్తూ చెట్టుపై నుంచి పడి, మరొ కరు పాముకాటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గుమ్మడవల్లి గ్రామానికి చెందిన చల్లా శ్రీను(42)తో పాటు మరికొంత మంది కలిసి మామిళ్లవారిగూడెం గ్రామ సమీపంలోగల తోటలో మామిడి కాయలు కోసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే శ్రీను చెట్టుపైకి ఎక్కి కాయలు కోస్తుండగా కొమ్మ విరిగి కింద పడిపోగా తలకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతా నం ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాదం నెలకొంది.   

మామిడి కాయలు కోస్తూపాముకాటుకు గురై..
మండల కేంద్రంలోని దొంతికుంట ప్రాంతానికి చెందిన సిద్దేశి చందు (16) అనే విద్యార్థి ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. మంగళవారం తండ్రి అచ్చయ్యతో కలిసి తూర్పుబజార్‌ సమీపంలోగల తోటలో మామిడి కాయలు కోసేందుకు వెళ్లాడు. తండ్రితో పాటు కాయలు కోస్తున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు. విషయాన్ని గమనించలేదు. ఇంటికి వెళ్లి స్నానం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోవడంతో కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చందు మృతితో కుటుంబ సభ్యులు  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు