విషాదం నింపిన ప్రయాణం

26 Sep, 2018 12:47 IST|Sakshi
ఘటనా స్థలంలో రెడ్డిప్రియ, వెన్నెల మృతదేహాలు

నెల్లూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చిత్తూరు, కొడవలూరు: నెల్లారు జిల్లా కొడవలూరు మండలంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో పెను విషాదం నింపింది. మృతుల్లో 18 నెలల పాప ఉండటంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నాయి. విజయవాడలో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాట్లలో భాగంగా తిరుపతి నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కోసూరి రెడ్డిప్రియ (33), ఆమె కూతురు సిరి సాహితి (18 నెలలు), ఆ కళాశాల అధ్యాపకులు వీఏ వెన్నెల (21), యర్ర సలోమి (23) శ్రీకాళహస్తి నుంచి షిఫ్ట్‌ డిజైర్‌ కారులో బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని రాచర్లపాడు గమేసా ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెడ్డిప్రియ, సిరిసాహితి, వీఏ వెన్నెల ఘటనా స్థలంలోనే మృతిచెందారు.

రెడ్డిప్రియ శ్రీకాళహస్తిలోని శ్రీరాంనగర్‌లో భర్త గుర్రప్పతో కలిసి నివాసముంటున్నారు. వీరికి సిరిసాహితితోపాటు నాలుగేళ్ల బాబు కూడా ఉన్నారు. పాపకు ఒకటిన్నర సంవత్సరం వయసు కావడంతో ఇంట్లో వదలి వెళ్లలేక వెంట తీసుకెళ్లారు. మరో మృతురాలైన అధ్యాపకురాలు వీఏ వెన్నెల అవివాహిత. ఆమె తిరుపతి రాజీవ్‌నగర్‌ పంచాయతీ క్రాంతినగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. గాయపడి నెల్లూరు సింహపురి వైద్యశాలలో చికిత్స పొందుతున్న అధ్యాపకురాలు యర్ర సలోమి వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందినవారు కాగా ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉంటున్నారు. పోలీసులు బాధిత కుటుంబాలకు సమాచారం అందించి మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెడ్డిప్రియ కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకొని భోరున విలపించడం అందరినీ కలచివేసింది. తమ గారాలపట్టి సిరి సాహితీతో రెడ్డిప్రియ సోమవారం కూడా ఫొటోలు దిగారని, మంగళవారం ఇలా చూడాల్సి వచ్చిందంటూ రోదించారు. పంచనామా అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఏఎస్సై శ్రీనాథ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు