బెయిల్‌పై విదేశీ మోడల్‌ విడుదల

8 Jun, 2018 19:41 IST|Sakshi
బెయిల్‌పై విడుదలైన ఉక్రెయిన్‌ మోడల్‌ డారియా మోల్చా

గోరఖ్‌పూర్‌: ఒరిజినల్‌ వీసా లేకుండా భారత్‌లో తిరుగుతూ అరెస‍్టయిన ఉక్రెయిన్‌కు చెందిన మోడల్‌ డారియా మోల్చా(20) బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయ్యారు. గత నెల ఏప్రిల్‌ 3న ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని సిటీస్‌ పార్క్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో ఆమె అక్రమంగా, నకిలీ డాక్యుమెంట్లతో దేశంలో ఉంటున్నట్లు బయటపడింది. ఆమెను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి..అనంతరం కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

ఏప్రిల్‌ 12న ఆమె పెట్టుకున్న బెయిల్‌ దరఖాస్తును జిల్లా కోర్టు తిరస్కరించింది. వారం తర్వాత మరోసారి డారియా హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు వారం రోజుల క్రితం బెయిల్‌ మంజూరు చేసింది. గురువారం ఆమె ఉంటున్న జైలు నుంచి రిలీజ్‌ ఆర్డర్‌ వచ్చింది.

ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, ఫారినర్స్‌ యాక్ట్‌ కింద డారియా మాల్చాపై కేసు నమోదైనట్లు, శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంటకు జైలు నుంచి విడుదలైనట్లు జైలు సూపరింటెండెంట్‌ రామధాని విలేకరులకు తెలిపారు. డారియాను ఢిల్లీలోని ఉక్రెయిన్‌ ఎంబసీకి తరలించినట్లు గోరఖ్‌పూర్‌ సీనియర్‌ ఎస్‌పీ శలభ్‌ మాతూర్‌ తెలిపారు. కోల్‌కత్తా నుంచి వచ్చిన చందారి రావత్‌, ఆదర్శ్‌ అనే ఇద్దరు ఆమె బెయిల్‌ కోసం సహకరించారని పోలీసు అధికారి తెలిపారు.

నేపాల్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా విదేశీయులు చొరబడుతున్నారన్న సమాచారం స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) అధికారులకు చేరడంతో వారు అప్రమత్తుమై సోదాలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఆ సోదాల్లో భాగంగానే పార్క్‌ రెసిడెన్సీ హోటల్‌లో డారియా మోల్చా అరెస్ట్‌ అయింది. మోల్చా రెండు సంవత్సరాల నుంచి తరచూ భారత్‌ను సందర్శిస్తూ వస్తోంది. చివరి సారి డారియా 2017 డిసెంబర్‌లో ఢిల్లీని సందర్శించింది.

 డారియా స్నేహితుడు ఇంషాన్‌ సలహా మేరకు నేపాల్‌ నుంచి సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించినట్లు నిందితురాలు డారియా విచారణలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు తెలిపారు. ఆమె నుంచి  నకిలీ డ్రైవింగ్‌ లైసెన్స్‌, రెండు పాస్‌పోర్టులు, రెండు మొబైల్‌ ఫోన్లు, ఒక టాబ్లెట్‌, ఒక ఐపాడ్‌, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు