యూపీలో యోగి ‘దబాంగ్‌’

18 Feb, 2018 11:54 IST|Sakshi
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న యోగి మార్ఫింగ్‌ ఫోటో

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పుడు జైళ్లన్నీ క్రిమినల్స్‌తో కిటకిటలాడుతున్నాయి. ఏ క్షణాన తమల్ని లేపేస్తారేమోనన్న భయంతో వారంతా స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోతున్నారు. ఇక మీద నేరాలు చెయ్యం.. ప్రాణాలతో వదిలేయండి బాబోయ్‌.. అంటూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు కూడా దర్శనమిస్తున్నాయి. 

నేరాలను అదుపు చేసే క్రమంలో నేరస్థులపై ఉక్కు పాదం మోపుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుస ఎన్‌కౌంటర్లతో భీతిల్లుతున్న నేరస్థులు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా 142 మంది నేరస్థులు లొంగిపోయారని యూపీ డీజీపీ కార్యాలయం శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది.  ‘పోలీసులకు కాదు.. నేరానికి నేను భయపడుతున్నా సార్‌’ అంటూ దబాంగ్‌ సినిమాలోని డైలాగ్‌ను యూపీ పోలీస్‌ శాఖ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అంతే సల్మాన్‌ ఫోటోకు యోగి తలను అంటించేసి పలువురు సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. అవి ఇప్పుడు తెగ వైరల్‌ అవుతున్నాయి. 

కూలీపనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటాం తప్ప ఇకపై నేరాల జోలికి వెళ్లబోమని వారంతా చెబుతున్నారంట. వీరిలో చాలా మందిపై భారీ రివార్డులే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి ఆస్తులను సీజ్‌ చేయటంతో ధరావత్తు కూడా కట్టలేని స్థితిలో కొందరు జైళ్లలోనే ఉండిపోయారు. ఇక గత నెలరోజుల్లో 60 ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోగా.. 8 మంది గ్యాంగ్‌స్టర్లను పోలీసులు ఎన్‌కౌంటర్‌ లో లేపేశారు. గతేడాది యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 1200 ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. 40 మంది క్రిమినల్స్‌ను పోలీస్‌ శాఖ మట్టుబెట్టింది. 

ఎన్‌కౌంటర్ల పర్వంపై మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేయగా.. యూపీ ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. క్రిమినల్స్‌ పై ఉదాసీనత చూపటమే ప్రజా స్వామ్యానికి, సమాజానికి నిజమైన చేటు అని సీఎం యోగి చెబుతున్నారు. తుపాకీకి తుపాకీతో సరైన సమాధానం చెప్పాలని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.

మరిన్ని వార్తలు