చిన్నారి వర్షిత కేసు తీర్పు రేపటికి వాయిదా

17 Feb, 2020 15:05 IST|Sakshi
నిందితుడు మహ్మద్‌ రఫీ

సాక్షి, చిత్తూరు : మదనపల్లె సమీపంలోని అంగళ్లులో గతేడాది నవంబర్‌ 7న హత్యకు గురైన చిన్నారి వర్షిత కేసు తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. తన వాదనలు వినేందుకు సమయం కావాలని ముద్దాయి రఫీ కోరడంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు. వాదనలు విన్న తర్వాతే తీర్పు ఇచ్చే అవకాశం ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లోకనాథ్‌ పేర్కొన్నారు. కాగా, గతేడాది నవంబర్‌ 7న మదనపల్లె సమీపంలోని అంగళ్లులో చిన్నారి వర్షిత హత్యాచారానికి గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మదనపల్లె మండలంలోని బసినికొండకు చెందిన లారీ క్లీనర్‌ మహ్మద్‌ రఫీ(27) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. అప్పటికే తప్పించుకున్న నిందితుడు ఛత్తీస్‌ఘడ్‌కు పారిపోయాడు.

కేసును చాలెంజ్‌గా తీసుకున్న ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ నిందితుడిని పట్టుకోవడానికి మదనపల్లె డీఎస్పీ రవిమనోహరచ్చారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నియమించారు. ఎట్టకేలకు నవంబర్‌ 16న రఫీని అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందు హాజరపరిచారు. ఈ ఘటనకు సంబంధించి పలు ఆధారాలు సేకరించి న్యాయస్థానానికి అందజేశారు. నేరం జరిగిన 17 రోజుల్లోనే చార్జిషీట్‌ పత్రాన్ని న్యాయస్థానానికి అందించారు. చిత్తూరులోని జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట హరినాథ్‌ ఈ కేసు విచారణ ప్రారంభించారు. పోలీసులు ఇచ్చిన అన్ని సాక్ష్యాలను పరిశీలించారు. ఈనెల 14న విచారణ కూడా పూర్తయింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తారనే ప్రచారంతో బాధితులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కేసును ఈ నెల 18కి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు