పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్‌..?

20 May, 2019 11:52 IST|Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని సుపారీగ్యాంగ్‌తో సంబంధం ఉన్న  ఇద్దరు వ్యక్తులను శనివారం అర్ధరాత్రి మానుకోట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దమ్మపేట మండలానికి చెందిన ఒకరిని..ఇద్దరు వ్యక్తులు హత్య చేసేందుకు యత్నిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.  ఆ ఇద్దరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాంతం నుంచి శనివారం మహబూబాబాద్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళ్తే..
దమ్మపేట ఉపసర్పంచ్, అధికార పార్టీ నాయకుడు దారా యుగంధర్‌తో పాటు శేషగిరిరావును మానుకోట పోలీసులు శనివారం అర్ధరాత్రి దమ్మపేటలో అదుపులోకి తీసుకుని కేసముద్రం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెల్లారేసరికల్లా సోషల్‌ మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చింది. అదే విధంగా యుగంధర్‌తో పాటు మరికొందరికి, దమ్మపేట మండలం నల్లకుంటకు చెందిన గిరిజనుడు సోడెం వెంకట్‌కి మధ్య భూ వివాదాలున్నాయి. ఈ విషయంలో కేసులు, భౌతికదాడులు కూడా జరిగాయి. శాసనసభ ఎన్నికల సమయంలో గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారని, హత్యాయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. కొద్దికాలం పాటు భూవివాదం.. వెంకట్‌ తన సహచరులు చేస్తున్న ఆందోళనలు నిలిచిపోయాయి.

శనివారం అర్ధరాత్రి వెలుగులోకి..
పోలీసుల చర్యతో మళ్లీ అన్ని విషయాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు పక్కా ఆధారాలతోనే ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు భూ ఉద్యమాలకు పాల్పడుతున్న సోడెం వెంకట్, ఊకే సత్యం, ఊకే చందర్రావులను చంపేందుకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున మొత్తం రూ.30లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారాన్ని పక్కా ఆధారాలతో పోలీసులు సేకరించినట్లు తెలిసింది. కేసముద్రం ప్రాంతానికి చెందిన ఓ మాజీ మావోయిస్టు అనుచరుడు పిస్టల్‌తో పోలీసులకు కొద్దిరోజుల క్రితం చిక్కాడు.

అతడిని విచారించగా దమ్మపేట హత్యల డీల్‌ను కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అతడిని పోలీసులు అప్రూవర్‌గా మార్చుకుని.. ఫోన్‌కాల్స్‌ ద్వారా యగంధర్‌తో మాట్లాడించి వాటిని రికార్డు చేయించినట్లు వాట్సాప్‌లో ప్రచారం జరుగుతోంది. గతంలో హత్యాయత్నం చేసి విఫలం చెందినట్లు సదరు అప్రూవర్‌ పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలిసింది. దీంతో విచారణ వేగవంతం చేసి.. తన హత్యకు కుట్ర పన్నారని.. ఓ వ్యక్తికి సుపారీ కూడా ఇచ్చారనే విషయం తెలియని వెంకట్‌కు అటు పోలీసులు, ఇటు సుపారీ తీసుకున్న వ్యక్తి ఆధారాలతో చూపించి.. వెంకట్‌ను కిడ్నాప్‌ చేసినట్లు వీడియోకాల్‌ ద్వారా యుగంధర్‌ నమ్మించారు. ఆ తర్వాత మాజీ మావోయిస్టుతో పాటు అతని అనుచరుల మాదిరిగా మఫ్టీలో  దమ్మపేటకు వచ్చి.. యుగంధర్‌ దగ్గర రూ.3లక్షలు నగదు తీసుకున్నారు.

మరో రూ.2లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు(ఆధారం కోసం). ఇవన్నీ ఆధారాల కోసం రికార్డు చేసుకుని పక్కా వ్యూహంతో శనివారం రాత్రి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఈ కథంతా ఆదివారం ఉదయం నుంచి తోకలేని పిట్టలా పదే పదే సంచరిస్తోంది. ఇంతకీ మహబూబాబాద్‌ పోలీసులు ఏం తేలుస్తారో.. వేచి చూడాలి మరి. ఈ విషయమై జిల్లా పోలీసు ఉన్నతాధికారులను సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించగా వారు అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా