నకిలీ ఫొటోతో మోసం

26 Sep, 2019 21:55 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : పరాయి వ్యక్తి ఫొటోను తన ఫొటోతో చేర్చి  బ్యాంక్‌ను మోసగించింది ఓ మహిళ. కొరాపుట్‌ జిల్లాలోని జయపురంలో ఒక బ్యాంక్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది. పరాయి వ్యక్తిని తన భర్తగా ఫొటోలో చూపించి రూ.20 వేలు రుణం తీసుకుని పరారైన మహిళపై ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి జయపురం సదర్‌  పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  2017లో ఓ మహిళ తాను జయపురం సమితిలోని పాత్రోపుట్‌ గ్రామానికి చెందిన ఫూల్‌మతి కొటియ అని తన భర్త మాధవ కొటియ అని తెలిపి మాధవ కొటియతో తాను ఉన్న  ఫొటోను బ్యాంక్‌ లో సమర్పించింది. బ్యాంక్‌ రుణానికి అవసరమైన కాగితాలను  సమర్పించి ఓ మహిళా స్వయం సహాయక గ్రూపులో సభ్యురాలిగా ఉన్నట్లు చెప్పి రూ.20 వేలు రుణం తీసుకుంది.

రుణం తీసుకుని రెండేళ్లు గడిచిన తరువాత అసలైన పాత్రోపుట్‌ ఫూల్‌మతి మహిళా గ్రూపు ద్వారా రుణం కోసం దరఖాస్తు పెట్టుకుంది. అయితే అంతకు ముందే ఆమెపై రుణం ఉందని, అందుచేత మరోసారి ఆమెకు రుణం మంజూరు చేయలేమని బ్యాంక్‌ సిబ్బంది వెల్లడించడంతో  ఆమె భర్త కంగుతిన్నాడు. తాము ఎన్నడూ ఏ బ్యాంక్‌ లోనూ రుణం తీసుకోలేదని మొర్రోమన్నారు. గతంలో తీసుకున్న రుణం రూ.20 వేలకు మరో ఇరవై వేలు వడ్డీ అయిందని మొత్తం రూ.40 వేలు కట్టాలని ఆ బాకీ తీర్చిన తరువాతనే తిరిగి  రుణం మంజూరు చేస్తామని బ్యాంక్‌ సిబ్బంది స్పష్టం చేయగా  వారు బ్యాంక్‌ లో రుణం తీసుకోలేదని గట్టిగా వాదించారు. దీంతో బ్యాంక్‌ సిబ్బంది   రికార్డులు తిరగేశారు.

లబోదిబోమన్న అసలైన భార్యాభర్తలు
అయితే ఆనాడు ఆ రుణం తీసుకున్న మహిళ సమర్పించిన ఫొటో పరిశీలించగా అందులో ఆ మహిళతో పాటు ఫూల్‌మతి భర్త మాధవ కొటియ ఫొటో ఉంది. ఆ ఫొటో చూసి ఫూల్‌మతి, ఆమె భర్త మాధవ నివ్వెర పోయారు. ఆ మహిళ తన ఫొటోను ఆమెతో ఫొటోతో చేర్చి బ్యాంక్‌ ను మోసగించి రూ.20 వేలు తీసుకు పోయిందని మాధవ కొటియ స్పష్టం చేశాడు. ఆమె ఎవరో తనకు తెలియదు అని వాపోయాడు. ఆ విషయమై మాధవ కొటియ జయపురం సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మోసం చేసి బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుపోయిన మహిళ కోసం దర్యాప్తు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు