కి‘లేడి’ ఆటకట్టు

18 Nov, 2017 11:32 IST|Sakshi
నిందితురాలు సుజాత

బంజారాహిల్స్‌ : ప్రకటనలు, మాటలతో మాయచేసి మోసాలకు పాల్పడుతూ రూ. కోట్లు కొట్టేసిన కి‘లేడి’ని బంజారాహిల్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు విల్లివాకం నారాయణమేస్త్రీ రెండో వీధికి చెందిన సుజాత అలియాస్‌ కన్మణి  ‘ఎక్స్‌ప్రెస్‌ కార్‌ వాష్‌’ కంపెనీ ఏర్పాటు చేసింది. రూ.2.50 లక్షలు డౌన్‌పేమెంట్‌ కడితే మీ పేరుతో కారును కొనుగోలు చేసి, అద్దెకు తిప్పుతూ ప్రతినెల రూ.30 వేలు చెల్లిస్తామని ప్రకటనలు ఇచ్చింది. దీనిని చూసి ఆకర్శితుడైన ముషీరాబాద్‌కు చెందిన రామారపు శశాంక్‌తో పాటు మరో 23 మంది 2016 సెప్టెంబర్‌ 7న రూ.2.50 లక్షల చొప్పున చెల్లించారు.

నెలలు గడుస్తున్నా కార్లు కొనుగోలు చేయకపోగా ప్రతినెలా ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వక పోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమెను విచారించగా నాగోల్, బేగంపేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనూ ఇదే తరహాలో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఏడాదిలో 160 మందిని మోసం చేసి రూ.5 కోట్లు కాజేసినట్లు తెలిసింది. తమిళనాడులోనూ ఆమెపై ఈ తరహా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యవర్తులు సురేష్‌బాబు, శ్రీకాంత్, శేషులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

చదివింది ఎంఏ ఎంఫిల్‌
ఎక్స్‌ప్రెస్‌ కార్‌ వాష్‌ కంపెనీ పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న సుజాత అలియాస్‌ కన్మణి ఎంఏ ఎంఫిల్‌ చదివారు. ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడటమే కాకుండా ఎదుటివారిని ఇట్టే బుట్టలో వేసుకుంటారు. చాలా మంది ఆమె మాటలు నమ్మి మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా ఆమె వైఖరిలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు