ఆకర్షించి నిలువు దోపిడీలు

15 Sep, 2018 11:22 IST|Sakshi
పోలీసులకు పట్టుబడిన నిందితులు

బనశంకరి : పురుషులను ఆకర్షించి నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి నిలువుదోపిడీ చేస్తున్న  ఇద్దరు కిలాడీ మహిళలను శుక్రవారం ఉప్పారపేటే పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.  వివరాలను డీసీపీ రవి చెన్నణవర్‌ మీడియాకు వెల్లడించారు. బనశంకరి సారక్కిగేట్‌కు చెందిన ఆశా, దాసరహళ్లి బైలప్పసర్కిల్‌కు చెందిన సుధ అలియాస్‌ రేఖ, రత్న, సుమ, పద్మ, ఆటోడ్రైవరు రాజేశ్‌లు బృందంగా ఏర్పడి మెజస్టిక్‌ చుట్టుపక్కప్రాంతాల్లో సంచరించే పురుషులను ఆకర్షించేవారు. 

అనంతరం వారిని ఆటోలో నిర్జీనప్రదేశంలోకి తీసుకెళ్లి నగదు, బంగారుఆభరణాలు దోచుకునేవారు. ఆభరణాలు ఇవ్వడానికి నిరాకరిస్తే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బెదిరించి దోపిడీలకు పాల్పడేవారు. ఈ నెల 11 తేదీన మెజస్టిక్‌లో ఉడుపికి చెందిన సంతోష్‌కుమార్‌శెట్టిని రెచ్చగొట్టి ఆటోలో తీసుకెళ్లిన ముఠా గ్యాంగ్‌.. అతడిని బెదిరించి రూ.3 వేల నగదు దోచుకుని ఉడాయించారు.  బాధితుడు ఉప్పారపేటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ సతీశ్‌కుమార్‌ పోలీసు సిబ్బందితో కలిసి తీవ్రంగా గాలించి శుక్రవారం ఆశ, సుధ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేసి పరారీలో ఉన్న మిగిలిన వారికోసం గాలింపుచర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు