రెండు బైక్‌లు ఢీ..యువతి మృతి

19 Jun, 2018 09:15 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పద్మ

ద్వారకాతిరుమల : రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో రోడ్డుపై పడిన యువతి మీద నుంచి టిప్పర్‌ లారీ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మరో యువతి, యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటన ద్వారకాతిరుమల శివారు రాళ్లకుంట రహదారిపై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. మండలంలోని ఐఎస్‌.రాఘవాపురం పంచాయతీ రామానుజాపురంకు చెందిన గోతం పద్మ(18), ఆమె స్నేహితురాలు తలారి వజ్రంలు ద్వారకాతిరుమలలో ఉద్యోగ బాధ్యతలు పూర్తిచేసుకుని స్వగ్రామానికి స్కూటీపై వెళుతున్నారు. వీరిద్దరు వెళుతున్న స్కూటీ శ్రీవారి శేషాచలకొండపై ఉన్న టోల్‌ గేటును దాటి రాళ్లకుంట రోడ్డులోకి ప్రవేశించింది. ఇదే సమయంలో ద్వారకాతిరుమలకు చెందిన బంటుమిల్లి రఘు రాళ్లకుంటలో తన పనులు పూర్తిచేసుకుని ద్వారకాతిరుమలకు తిరిగి వస్తున్నాడు. సంఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి వీరిద్దరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

దీంతో స్కూటీపై ఉన్న పద్మ రోడ్డుపై పడగా, వజ్రం, రవి రోడ్డు మార్జిన్‌లో పడ్డారు. ఇదే సమయంలో నల్లజర్ల నుంచి రాళ్లకుంట మీదుగా ద్వారకాతిరుమల వైపుగా వస్తున్న టిప్పర్‌ లారీ రోడ్డుపై పడిన పద్మ తల మీద నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతిచెందింది. రోడ్డు మార్జిన్‌లో పడిన వజ్రంకు కాలు విరగగా, రఘు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ సిబ్బంది ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలు పద్మ తన సొంత గ్రామమైన రామానుజాపురంలో ఆరు నెలల కిత్రం సాధికార మిత్రగా జాయిన్‌ అయ్యింది. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా ద్వారకాతిరుమలలో ఇస్తున్న శిక్షణను సోమవారం ఆమె పూర్తి చేసుకుంది. వజ్రం డ్వాక్రా వీవోఏగా రామానుజాపురంలో పనిచేస్తోంది.

మరిన్ని వార్తలు