హద్దులు దాటిన ప్రేమ.. పెళ్లి కాకుండానే

17 Feb, 2020 07:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తొందరపాటు తప్పిదం

పెళ్లికాకనే గర్భం దాల్చిన యువతి

ఏడు నెలల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైనం

సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : తొందరపాటు నిర్ణయాలతో ఆ ప్రేమికులు పెళ్లి చేసుకోకనే ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి యువతి గర్భం దాల్చింది. పెద్దలకు చెప్పకుండా, అనుమానం రాకుండా చూసుకున్న యువతికి ఏడవ నెలలోనే పురిటినొప్పులు రావడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆదివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయకముందే తానే కారణమంటూ ఓ యువకుడు పోలీసులను కలిసి ఒప్పుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. ఉరవకొండ పట్టణానికి చెందిన యువతి, యువకుడి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అలా శారీరకంగానూ కలుస్తుండటంతో యువతి గర్భం దాల్చింది. అయితే ఇంట్లో ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టింది. రోజురోజుకూ ఆమె శరీరంలో మార్పులు వస్తున్నా తల్లిదండ్రులూ గమనించలేకపోయారు. ఏడు నెలల గర్భంతో ఉన్న యువతికి నొప్పులు రావడంతో తల్లి అనుమానం వచ్చి గట్టిగా మందలించింది. అప్పుడు తాపీగా అసలు విషయం చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున ఆ యువతి మగబిడ్డను ప్రసవించింది. విషయం తెలియగానే యువకుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి యువతిని ప్రేమించింది తానేనని ఒప్పుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బాధిత యువతి నుంచి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదు. (కూతురు క్యారెక్టర్‌ను అనుమానించి..)

ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు
తలుపుల: ప్రేమ పేరుతో కొందరు యువకులు బాలికల వెంటపడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. పెద్దలకు తెలిసినా మందలించినా వినకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తలుపుల మండలం కొత్తపల్లికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి అనే యువకుడు సమీప గ్రామంలో పదో తరగతి చదువుతున్న బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అలా రోజూ పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో కలుసుకునేవారు. రెండు రోజుల కిందట మాయమాటలు చెప్పి బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత శనివారం రాత్రి గ్రామ సమీపంలోని వదిలేసి వెళ్లిపోయాడు. బాలికను మోసం చేసి తీసుకెళ్లాడంటూ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినోద్‌కుమార్‌రెడ్డిపై పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం) యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు రూరల్‌ సీఐ మధు ఆదివారం తెలిపారు. (ఆ తప్పటడుగే యువతి ప్రాణం తీసింది)

యువకుడిపై పోక్సో కేసు 
అనంతపురం న్యూసిటీ: తొమ్మిదో తరగతి అమ్మాయిని వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురంలోని సాయినగర్‌ 5వ క్రాస్‌లో ఉంటున్న ఎ.హుస్సేన్‌ జీసస్‌నగర్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో వారం రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు. బాలిక ఎక్కడికి వెళ్లినా ప్రేమించాలంటూ వెంటబడుతున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హుస్సేన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ ఎం.శ్రీనివాసులు ఆదివారం తెలిపారు.

ప్రేమ విఫలమై మహిళా వలంటీర్‌ ఆత్మహత్య
గుత్తి: ప్రేమ విఫలమై మహిళా వలంటీర్‌ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి 1వ బ్లాక్‌ వార్డు వలంటీర్‌ రమా భార్గవి (23), ఇదే గ్రామానికి చెందిన బైక్‌ మెకానిక్‌ ఇమామ్‌ హుసేన్‌(మసి) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇమామ్‌ హుసేన్‌కు పది రోజుల కిందట మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రమాభార్గవి మదనపడుతుండేది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో తాను జీవించడం వ్యర్థమని భావించి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కాసేపటి తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి రమాభార్గవిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రమా భార్గవి మృతికి వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్‌ ఉద్యోగులు, సిబ్బంది సంతాపం ప్రకటించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా