ఢిల్లీలో మరో వైద్యుడికి కరోనా వైరస్

1 Apr, 2020 12:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ  కేన్సర్ వైద్యుడికి కరోనా,  ఆసుపత్రి మూసివేత

నాలుగుకి చేరిన  కరోనా బాధిత  వైద్యుల సంఖ్య

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా  వైరస్  ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడికి సోకడం ఆందోళన రేపింది. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారులు.  స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే వైద్యుడు (35)  కరోనా వైరస్( కోవిడ్ -19)  పాజిటివ్ అని  తేలడంతో  ఆసుపత్రిని మూసివేశారు. ఆసుపత్రి ఆవరణ, ఔట్  పేషెంట్ విభాగం, ల్యాబ్స్, ఇతర భవనాలను శానిటైజ్ చేసే ఉద్దేశంతో ఈ  ఆసుపత్రిని మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు.  సంబంధిత  అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. బీఏ షెర్వాల్ అన్నారు. కరోనా సోకిన డాక్టర్ ను కలిసినవారు కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. దీంతో రాజధానిలో కరోనా వైరస్ వ్యాధికి పాజిటివ్ గా తేలిన  వైద్యుల  సంఖ్య నాలుగుకి చేరింది.

బ్రిటన్ నుంచి వచ్చిన సోదరుడి కుటుంబాన్ని ఇటీవల ఆయన కలిసారని, వారినుంచి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు. ఆంకాలజీ విభాగానికి చెందిన ఈ వైద్యుడిని రోహిణిలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేరారు. అతని భార్య, బిడ్డను ఢిల్లీ గేట్ సమీపంలోని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు.

కాగా ఢిల్లీ కరోనా కేసుల్లో వైద్యులు కూడా వుండటం  కలకలం  రేపుతోంది. మొహల్లా క్లినిక్ వైద్యులు ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో మౌజ్‌పూర్‌లోని మొహల్లా ప్రయివేటు వైద్యుడికి కరోనా సోకింది. అనంతరం ఈశాన్య ప్రాంతంలోని హరినగర్ మొహల్లా క్లినిక్‌లకు చెందిన డాక్టర్ దంపతులకు,17 ఏళ్ల కుమార్తెకు మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్ తేలింది. భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య బుధవారం నాటికి 1663 కు పెరగ్గా, ఢిల్లీలో రెండు మరణాలు, 121  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

మరిన్ని వార్తలు