-

40 మంది అన్నదాతలకు సన్మానాలు

21 Sep, 2016 23:24 IST|Sakshi
40 మంది అన్నదాతలకు సన్మానాలు
బలరామ జయంతి వేళ బీకేఎస్‌చే రైతులకు సముచిత స్థానం
అమలాపురం : సాగు కష్టాలు దిగమింగి శ్రమను పెట్టుబడిగా పెట్టి ప్రతికూల పరిస్థితులను అధిగమించిన అన్నదాతలకు భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) సముచిత స్థానం ఇచ్చి సత్కరించింది. బలరామ జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 40 మంది రైతులకు స్థానిక గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాలకు ఆహ్వానించి ఒకే వేదికపై ఘనంగా సన్మానించారు. మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచేలా ఈ 40 మంది రైతులు గో ఆధారితం, సేంద్రియ సాగు, అంతర పంటలు, ఉద్యాన పంటలను విరివిగా పండిస్తూ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. సాధారణంగా రైతులకు రైతు సంఘాలు సత్కరించటమే అరుదు. ఈ అరుదైన ఘట్టాన్ని బీకేఎస్‌ ఆవిష్కరించింది. 40 మంది రైతులతోపాటు రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్న అమలాపురం ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు సీహెచ్‌ శ్రీనివాసులు, పి.గన్నవరం వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు ఎలియాజర్, ముమ్మిడివరం పశుసంవర్ధక శాఖ వైద్యుడు మధులను కూడా బీకేఎస్‌ ఇదే వేదికపై సత్కరించింది. అలాగే ఇటీవల మృతి చెందిన బీకేస్‌ సభ్యులు, రైతులు గనిశెట్టి రామచంద్రరావు (సన్నవిల్లి), చేకూరి రంగరాజు (మాగం) జ్ఞాపకార్ధం రైతులు అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, చేకూరి సత్యనారాయణరాజులను కూడా బీకేస్‌ సత్కరించింది. బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ రైతు సత్కార సభలో బీకేస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు, జాతీయ  కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి, బీకేఎస్‌ ప్రతినిధులు అడ్డాల గోపాలకృష్ణ, యాళ్ల వెంకటానందం, బొక్కా ఆదినారాయణ,అప్పారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు