పెద్దపులే టార్గెట్‌

28 Jun, 2017 11:01 IST|Sakshi
పెద్దపులే టార్గెట్‌

► నల్లమలలోకి హర్యానాకు చెందిన వేటగాళ్ల ముఠా ప్రవేశించినట్లు సమాచారం
► రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన అటవీశాఖ
► అడవిని జల్లెడ పడుతున్న అధికారులు
► అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గిరిజనులకు సూచన


ఆత్మకూరు రూరల్‌(కర్నూలు): ప్రపంచంలో అంతరించి పోతున్న జాతిగా రెడ్‌ డాటా బుక్‌లో నమోదైన పెద్ద పులులకు అత్యంత సురక్షిత అభయారణ్యంగా నల్లమలకు పేరుంది. నల్లమలలోని నాగార్జున సాగర్‌ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యాలు పెద్దపులులు అత్యంత వేగంగా ప్రవర్ధనం చెందడానికి అనువైన  ప్రదేశాలుగా దేశంలోనే గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతాల్లో సుమారుగా వంద పులులకు తక్కువ కాకుండా ఉండవచ్చని ఓ అంచనా. అంతా బాగుంది అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో వాటి భద్రతకు మళ్లీ ముప్పు ముంచుకొచ్చింది.

హర్యానాకు చెందిన ముగ్గురితో కూడిన వేటగాళ్ల ముఠా పులులను వేటాడేందుకు నల్లమలలో ప్రవేశించినట్లు జాతీయ పులుల సంరక్షణ సాధికార సంస్థ (ఎన్‌టీసీఏ) నుంచి నల్లమలలోని నాగార్జునసాగర్‌ – శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌ టైగర్‌ శర్వానంద్‌కు సమాచారమందింది. అలాగే వైల్డ్‌లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బోర్డు న్యూఢిల్లీ నుంచి కూడా ఇదే సమాచారం నల్లమల పరిధిలోని అటవీ అధికారులకు చేరింది. దీంతో అటవీ శాఖ నల్లమల పరిధిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.  

పులు వేటలో ఘనాపాఠీలు: నల్లమలలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న ముఠా సభ్యులు లక్ష్మీచాంద్, పప్పు, లీలావతిలు హర్యానా రాష్ట్రంలోని పంచకుర జిల్లాలో వేట ప్రధాన వృత్తిగా గల ఓ తెగకు చెందిన వారు. వీరు దేశంలోని పలు పెద్ద పులుల అభయారణ్యాలు నేషనల్‌ పార్కులలో వేటాడి చంపిన కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. అలవాటు నేర ప్రవృత్తి కలిగిన ఈ బృందం నల్లమల చేరుకుందన్న సమాచారం అటవీ శాఖ అధికారులను పరుగులు పెట్టిస్తోంది.

పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక నిఘా
మహానంది: నల్లమలలోకి పెద్ద పులల వేటగాళ్లు ప్రవేశించారనే సమాచారం మేరకు నల్లమల పరిధిలోని మహానంది, అహోబిలం, ఓంకారం, గుండ్ల బ్రహ్మేశ్వరం పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నంద్యాల డీఎఫ్‌ఓ శివప్రసాద్‌ తెలిపారు. ఇప్పటికే ఆయా పుణ్యక్షేత్రాల పరిధిలోని ప్రొటెక్షన్‌ వాచర్లు, సిబ్బందిని అలర్ట్‌ చేశామన్నారు. ఫారెస్ట్‌ రేంజర్లు, డివిజనల్‌ రేంజ్‌ ఆఫీసర్లు, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు, అసిస్టెంటు బీట్‌ ఆఫీసర్లు, ప్రొటెక్షన్‌ వాచర్లతో ప్రత్యేక టీములను కేటాయించామన్నారు. పగలు, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్లమల ఘాట్‌ రోడ్డు అయిన నంద్యాల–గిద్దలూరు దారిలో నిత్యం వాహనాల తనిఖీ చేపడతామన్నారు.      

అడవంతా గాలింపు
నల్లమలలో పెద్దపులల వేటగాళ్లు ప్రవేశించారనే సమాచారంతో అటవీశాఖాధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. చెంచుగూడేల్లో, అటవి సమీప గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్ని బేస్‌క్యాంపుల సిబ్బంది సమన్వయంతో కాలినడకన అడవంతా జల్లెడ పడుతున్నారు. హిందీ మాట్లాడే ఉత్తర భారతదేశ వ్యక్తులు,  అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారాన్ని తమకు తెలియజేయాలని ఆత్మకూరు అటవీ డివిజన్‌ ముఖ్య అధికారి సెల్వం ప్రకటించారు. 9440810058, 9493547206, 9493547207, 9493547221, 9493548832, 9493548825 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చి వన్యప్రాణును కాపాడాలని కోరారు.    

గతంలోనూ ఉత్తరాది వేటగాళ్ల సంచారం
నల్లమలలో పలుమార్లు ఉత్తర భారత దేశానికి చెందిన పులుల వేటగాళ్లు సంచరించారు. ఢిల్లీకి చెందిన రాణి సాహెబా అనే మహిళా వన్యప్రాణి స్మగ్లర్‌ తరఫున ఓ వేట గాళ్ల బృందం నల్లమలలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఆత్మకూరు అటవీ డివిజన్‌ అధికారులకు పట్టు బడింది. ఈ బృందంలోని వారు పగలు అటవీ సమీప గ్రామాల్లో బొమ్మలు, శాలువాలు, రగ్గులు అమమ్ముతూ తిరుగుతూ రాత్రి పూట అడవుల్లో ప్రవేశించి వన్యప్రాణులను వేటా డుతారు.

పట్టు బడిన వేటగాళ్ల బృందం ఇచ్చిన సమాచారం మేరకు రాణి సాహెబాపై నాగలూటి రేంజ్‌  అధికారులు కేసు నమమోదు చేసి ఆమెను ఢీల్లీలో అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఆత్మకూరు అటవీ డివిజన్‌ వెలుగోడు రేంజ్‌లోని నార్త్‌ బీట్‌లో పులులను వేటాడేందుకు ఉపయోగించే ఇనుప ఉచ్చు(ఐరన్‌  ట్రాప్‌) గతంలో లభ్యమయింది. ఈ తరహా ఉచ్చులను హర్యానా వేటగాళ్లు వినియోగిస్తారని అధికారుల ద్వారా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు