టీటీడీ ఉద్యోగుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు

26 Apr, 2016 11:45 IST|Sakshi

- అదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే నెపంతో సోదాలు
- కోట్ల రూపాయలు విలువచేసే డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం

తిరుచానూరు/తిరుపతి క్రైం : ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఫిర్యాదులు అందడంతో తిరుపతికి చెందిన ముగ్గురు టీటీడీ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కోట్లాది రూపాయల విలువజేసే డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నియామక విభాగపు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నరేంద్రరెడ్డి, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మోహన్ రెడ్డి, తిరుమల కల్యాణకట్టలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తంగవేలు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వచ్చాయి.

దీంతో కొంతకాలంగా వారిపై నిఘా పెట్టారు. మంగళవారం తిరుచానూరు వసుంధరనగర్‌లో నివాసం ఉంటున్న నరేంద్ర రెడ్డి, తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటున్న మోహన్ రెడ్డి, కొర్లగుంటలో ఉంటున్న తంగవేలు ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. అదే సమయంలో నలుగురు నరేంద్ర రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు.

వీరి ఇళ్లల్లో నుంచి దాదాపు కోట్లాది రూపాయల విలువైన డాక్యుమెంట్లు, ఇంటి పత్రాలు, బ్యాంకు లాకర్లు, బ్యాంక్ పాసుబుక్కులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు ఏసీబి డీఎస్పీ తెలిపారు. అయితే, పూర్తి స్థాయిలో విచారణతో పాటు సోదాలు నిర్వహిస్తేనే ఎంత అక్రమ ఆస్తులు కూడబెట్టారనే సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. వీరితో వ్యాపారం చేసిన వారిపైనా త్వరలోనే దాడులు చేస్తామని డీఎస్పీ చెప్పారు.

మరిన్ని వార్తలు