ఉద్యమ వేదికగా విజయవాడ

5 Aug, 2013 01:52 IST|Sakshi

విజయవాడ, న్యూస్‌లైన్ : రాజకీయ చైతన్యానికి, ఉద్యమాలకు ప్రతీకగా నిలిచే విజయవాడ మరో చరిత్రాత్మక ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. వారి కార్యాచరణకు విజయవాడ వే దికగా మారింది. ఏపీ ఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం జరిగింది.

ఈ నెల 12లోగా ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే ఆరోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు. అప్పటివరకు కార్యాచరణను కూడా ప్రకటించారు. మున్సిపల్ ఉద్యోగుల సీమాంధ్ర జేఏసీ ఆదివారం ఇక్కడ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి 72 గంటల పాటు మున్సిపల్ సేవలు బంద్ చేయాలని నిర్ణయించింది. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం కూడా సమావేశమై ఎపీ ఎన్జీవో అసోసియేషన్ తీసుకునే నిర్ణయానికి సంఘీభావం ప్రకటించాలని, వారు సమ్మెకు సిద్ధపడకపోతే తామే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.
 
 విజయవాడ గాంధీనగర్‌లో సందడి..

 ఉదయం నుంచి పోలీసు వాహనాలు.. మీడియా ప్రతినిధుల హడావుడి. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల సమైక్యాంధ్ర నినాదాలతో గాంధీనగర్ ప్రాంతం హోరెత్తింది. స్థానిక ఎన్జీవోల సంఘం భవనంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు  ఆ సంఘం రాష్ట కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల ఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5.40 వరకు సాగింది. సమావేశంలో ఏ చర్చిస్తున్నారో..భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందోనని ఆద్యంతం ఆసక్తి నెలకొంది.

సాయంత్రం ఆరు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణను రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణపై ఉద్యోగ సంఘాల జేఏసీకి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అంతిమంగా రాష్ట్ర సమైక్యత తమ ముందున్న లక్ష్యమంటూ నాయకులు ప్రకటించారు. జీతాలు రాకపోయినా...ఉద్యోగాలకు ముప్పు వచ్చినా సమైక్యత సాధించేవరకు ఉద్యమం వీడేది లేదని, ఇందుకు అన్ని వర్గాల మద్దతు కావాలని కోరారు.  ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమతిని  ఏర్పాటుచేసినట్టు ప్రకటించారు. ఈ సమితిలో అందరినీ భాగస్వాములను చేస్తున్నట్టు ప్రకటించారు. మూడెంచల విధానంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పనిచేస్తుందన్నారు. డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ సమితి పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
 
 తెలంగాణ కేసీఆర్ జాగీరా..


 తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని, సీమాంధ్ర ఉద్యోగులను వెళ్లిపొమ్మనే అర్హత ఆయనకు లేదని ఏపీ మున్సిపల్ ఎంప్లాయూస్ జేఏసీ నాయకులు చెప్పారు. నగరంలోని మున్సిపల్ అతిథి గృహంలో ఆదివారం వారు అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు, కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో నగరపాలక, పురపాలక సంఘాల్లో సోమవారం నుంచి 72 గంటలపాటు విధులు బహిష్కరించాలని సమావేశం నిర్ణరుుంచింది. కమిషనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణలో పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.

జేఏసీ అధ్యక్షుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారులు విధులకు హాజరై సంతకాలు చేశాక విధులు బహిష్కరించాలన్నారు. మూడు రోజుల బహిష్కరణ తర్వాత కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే అత్యవసర సేవల్ని నిలిపివేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. తొలుత పౌరసేవల్ని మాత్రమే స్తంభింపజేస్తామన్నారు. పురపాలక సంఘ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలన్నారు. కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పరిధిలోని పాఠశాలలు మూసివేయాల్సిందిగా కోరారు. కార్యాలయాల ఎదుట బైఠాయించాలని, మానవహారాలు నిర్మించాలని, 7న ఉద్యోగ, కార్మికులతో భారీ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ జేఏసీ కన్వీనర్ డి.ఈశ్వర్ మాట్లాడుతూ కేసీఆర్‌కు మతిభ్రమించిందన్నారు.

తెలంగాణ ఉద్యమం పేరుతో దందాలు చేసిన కేసీఆర్ కుమార్తె కవిత తన పిల్లల్ని గత ఏడాది వరకు విజయవాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదివించారని పేర్కొన్నారు. పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ చదలవాడ హరిబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలన్నీ ఆంధ్రప్రాంత ఆస్తుల్ని తీసుకెళ్లి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. జేఏసీ నాయకులు సీహెచ్.శ్రీనివాసరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు