మద్యం.. కల్తీ దందా..!

8 Aug, 2016 18:41 IST|Sakshi
షాపులో లూజ్‌ విక్రయాలు
  • కాగజ్‌నగర్‌లో పడగ విప్పుతున్న మాఫియా
  • మద్యంప్రియుల జీవితాలతో చెలగాటం
  • మహారాష్ట్రకు తరలుతున్న కల్తీసరుకు
  • చోద్యం చూస్తున్న అధికారులు
కాగజ్‌నగర్‌ : కాగజ్‌నగర్‌ ప్రాంతంలో మద్యం మాఫియా కోరలు చాస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మందుబాబుల జీవితాలతో చెలగాటమాడుతోంది. కాగజ్‌నగర్‌ ప్రాంతం మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడం, ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న చంద్రపూర్‌ జిల్లాలో మద్యపాన నిషేధం అమలులో ఉండడం కొందరు మద్యం అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. గత నెల 25న కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ వెనుక భాగంలో ఓ పాడుబడిన ఇంట్లో కల్తీ మద్యం తయారు చేసే కుటీర పరిశ్రమను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. బ్రాండెడ్‌ కంపెనీలకు చెందిన మద్యం కల్తీ చేస్తూ నకిలీ సీళ్లు బిగిస్తూ ఇటు సిర్పూర్‌ నియోజకవర్గంలో అటు మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటుండగా, అధికారులు ఆలస్యంగా పట్టుకున్నారు. 
 
గత కొంతకాలంగా పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొందరు మద్యం వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయించడమే కాకుండా లూజ్‌ విక్రయాలు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఫిర్యాదులున్నాయి. ఇటీవల పట్టణంలోని రాజ్‌కుమార్‌ లాడ్జి సమీపంలోని మద్యం దుకాణంలో అధిక ధరకు బీర్లు విక్రయించగా.. కొనుగోలుదారుడు ప్రశ్నించినందుకు అతడిని షాపు నిర్వాహకులు చితక్కకొట్టారని ఫిర్యాదులు అందాయి.
 
బ్రాండెడ్‌ మద్యం బాటిళ్లలో కల్తీ చేయడమే కాకుండా కొందరు స్పిరిట్‌ కలుపుతూ మద్యంప్రియుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. అయినప్పటీకి ఎకై ్సజ్‌ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. కల్తీదందా వ్యాపారులు కొందరు ఎక్సైజ్‌ అధికారులతో కుమ్ముకై దందా సాగిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. గత మే, జూన్, జూలైలో ఎక్సైజ్‌ అధికారులు నాలుగు వైన్స్‌షాపులు సీజ్‌ చేశారు. నకిలీ మూతలు బిగించి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. మద్యం కల్తీ దందా ఏ మేరకు సాగుతుందో దీన్ని బట్టే తెలుస్తోంది.
 
రాయల్‌ స్టాగ్, మెక్‌డావల్, ఆఫీసర్స్‌ ఛాయిస్, ఎంపెరియల్‌ బ్లూ వంటి బ్రాండెడ్‌ కంపెనీలకు చెందిన నకిలీ మూతలను హైదారాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌కు తీసుకువచ్చి స్పిరిట్‌ కలిపిన కల్తీ మద్యం సీసాలపై బిగించి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. స్పిరిట్‌ కలిపిన మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. కాలేయ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. గత ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు కాగజ్‌నగర్‌కు చెందిన ఆరుగురు మద్యంప్రియుల కాలేయం పూర్తిగా దెబ్బతిని మృత్యువాతపడ్డారు. మద్యం సేవించడం వల్లే మరణించారని వైద్యులూ ప్రకటించారు.
 
నియోజకవర్గంలోని సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, దహెగాం, కాగజ్‌నగర్‌ పట్టణంతోపాటు మండలంలో లైసెన్సు మద్యంషాపులు నిర్వహిస్తున్నారు. లైసెన్స్‌దారుల నుంచి కొందరు అక్రమార్కులు అధిక ధరలకు దుకాణాలు లీజుకు తీసుకుని ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ, నకిలీ దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి కల్తీ దందా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కల్తీ మద్యంపై కాగజ్‌నగర్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మంగమ్మను సంప్రదించగా.. కల్తీకి పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై కూడా జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రకు కల్తీ మద్యం రవాణా చేసే గుట్టును రట్టు చేసినట్లు తెలిపారు. కల్తీ, నకిలీలకు పాల్పడే వారిపై ప్రజలు తమకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 
 
 

 

మరిన్ని వార్తలు