కల్తీ మద్యానికి చెక్‌..!

21 Jul, 2016 23:51 IST|Sakshi
కల్తీ మద్యానికి చెక్‌..!

ప్రతి ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌కు కల్తీ పరీక్షించే కిట్లు..
–తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు
మిర్యాలగూడ అర్బన్‌: రాష్ట్ర ఆదాయంలో సింహభాగం మద్యం అమ్మకాల వల్లే వస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎక్సైజ్‌ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా కల్తీలేని మద్యం అందించడంపై దృష్టి సారించింది. కొంత మంది మద్యం దుకాణాల నిర్వాహకులు కల్తీ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.    దానిలో భాగంగా జిల్లాలోని అన్ని ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్లకు కల్తీని కనిపెట్టే కిట్లు సరఫరా చేసింది. దీంతో మద్యం కల్తీకి చెక్‌ పడే అవకాశం ఉంది. గతంలో ఎక్కడైనా మద్యంలో కల్తీ కనిపెట్టాలంటే బాటిల్‌ నుంచి సేకరించిన శాంపిల్‌ను హైదరాబాద్‌లోని సంబంధిత ల్యాబ్‌కు పంపి రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే చర్యలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాకుండా కిట్‌ల ద్వారా వెంటనే కల్తీని కనిపెట్టి సదరు మద్యం దుకాణాలపై చర్య తీసుకోవడానికి వీలుంటుంది.
జిల్లా వ్యాప్తంగా 15 కిట్లు పంపిణీ..
కల్తీ మద్యం అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని 15ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు కల్తీ చెక్‌ చేసే కిట్‌లను పంపిణీ చేసింది. మద్యం కల్తీనే కాకుండా కల్లులో కల్తీని గుర్తించేందుకు సైతం కిట్‌ అదజేశారు. వీటిని ఉపయోగించేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
 కల్తీ జరిగినట్లు తేలితే..
టెండర్లు దక్కించుకున్న బార్లు, వైన్స్‌ షాప్‌ల నిర్వాహకులు పెట్టిన పెట్టుబడిని అతి తక్కువ కాలంలో రాబట్టేందుకు మద్యాన్ని కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల బ్రాండెడ్‌ మద్యం సీసా మూతను సైతం చాకచక్యంగా తీసి అందులో చౌక మద్యం, నీరు పోసి కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం ఎక్కువగా బార్లు, రెస్టారెంట్లలో జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.   కిట్ల ద్వారా పరీక్షించినప్పుడు మద్యం కల్తీ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వస్తే  షాంపిల్స్‌ను తిరిగి వరంగల్‌ కెమికల్‌ ల్యాబ్‌కు పంపిస్తారు. ఆ రిపోర్టులో కూడా కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే మెదటిసారి రూ.1.50వేల  జరిమానాతో పాటు వారం రోజుల పాటు ఆ దుఖానాన్ని సీజ్‌ చేస్తారు. సదరు మద్యం షాప్‌లో రెండోసారి కూడా కల్తీ జరిగితే రూ.2లక్షల  జరిమానా, నెలరోజుల పాటు షాప్‌ సీజ్‌ చేస్తారు. మూడో సారి నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు లైసెన్స్‌ను రద్దు చేస్తారు.
వారం వారం తనిఖీలు..
 గతంలో మద్యం కల్తీని పరీక్షించేందుకు పరికరాలు లేకపోవడం వల్ల నెల రోజులకు ఒకసారి వైన్స్, బార్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు.  ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్లకు కల్తీ నిర్ధారణ కిట్లు అందించడంతో ప్రతి వారం తనిఖీలు నిర్వహిస్తున్నారు.  
మద్యం కల్తీ ఉన్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలి
– బి.సుధాకర్, ఎక్సైజ్‌ సీఐ, మిర్యాలగూడ
కల్లు, వైన్స్, బార్, రెస్టారెంట్లలో మద్యం కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.  కల్తీ మద్యం సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది.  ప్రభుత్వం కల్తీ లేని మద్యం అందించాలనే ఉద్దేశంతో కిట్లను అందజేసింది. ప్రతి మద్యం దుఖానంపై నిఘా ఉంచుతున్నాం.
 

మరిన్ని వార్తలు