గ్యాస్‌ మంట

2 Aug, 2017 00:09 IST|Sakshi
గ్యాస్‌ మంట
కొవ్వూరు :
ఇకపై జనం నెత్తినే వంట గ్యాస్‌ సబ్సిడీ పడనుంది. దీనికి కేంద్రం సుముఖంగా ఉన్నట్టు లోక్‌సభలో కేంద్రమంత్రి దర్మేంద్రప్రధాన్‌ లిఖితపూర్వకంగా వెల్లడించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జూలై నుంచి గ్యాస్‌ సిలిండర్‌పై రూ.4 పెంచనున్నట్టు ఆయన ప్రకటించడంపైనా ఆందోళన రేగుతోంది. 
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15,72,415 గృహావసర వంట గ్యాస్‌ కనెక‌్షన్లు ఉన్నాయి. ఏడాదికి ప్రతి వినియోగదారునికీ మొత్తం 12 సిలిండర్లు సబ్సిడీపై లభిస్తున్నాయి. అంత కంటే ఎక్కువ వినియోగిస్తే సబ్సిడీ లేకుండా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సబ్సిడీని పూర్తిగా తొలగించే వరకు లేదా మార్చి 2018 వరకు, లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతినెలా రూ.4 చొప్పున సిలిండర్‌ ధరను పెంచుతున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది.
2014 నుంచి సబ్సిడీ 
 2014 నవంబర్‌ నుంచి వంటగ్యాస్‌పై కేంద్రం రాయితీ ఇస్తోంది. దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తోంది. ముందుగా లబ్ధిదారుడు ప్రభుత్వం అందించే సబ్సిడీ సోమ్ముతో కలిపి సిలిండర్‌ ధర చెల్లించి కొనుగోలు చేస్తే తర్వాత సబ్సిడీ సొమ్ము జమ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సబ్సిడీ సోమ్ము రూ.200లకు పైబడి ఉండేది. ఈనెల రూ.41కి తగ్గిపోయింది. గ్యాస్‌ ధర ఆధారంగా సబ్సిడీ నిర్ధారణ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పుడు కేంద్రం యత్నిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 
రూ.ఐదు కోట్ల భారం:
తాజాగా సిలిండర్‌ ధర రూ.4 చొప్పున పెంచడం వల్ల  జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.63 లక్షలకుపైగా భారం పడుతున్నట్టు అంచనా. ఈ లెక్కన ఏడాదికి రూ.7కోట్లకుపైగా భారం పడుతుందని తెలుస్తోంది.  
 
సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తే..!
అదే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తే భారం పదిరెట్లు పెరగనుంది.  ఉదాహరణకు ఆగస్టులో ఒక్కో సిలిండర్‌పై  రూ.41 చొప్పున సబ్సిడీ అందించాలని చరుము కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన లెక్కిస్తే  జిల్లాలో మొత్తం లబ్ధిదారులపై నెలకు రూ.6,44,69,015 చొప్పున సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ లెక్కన ఈ భారం ఏడాదికి సుమారు రూ.77.33కోట్లు ఉంటుందని అంచనా. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు హెచ్చుతగ్గుల వల్ల గ్యాస్‌ ధరలల్లో స్వల్ప మార్పులున్నా.. సబ్సిడీ ఎత్తివేస్తే వినియోగదారులపై రెట్టింపు భారం పడుతుందనడంలో సందేహం లేదు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో మళ్లీ పేదలు వంటగ్యాస్‌ భారం తగ్గించుకోవడం కోసం కట్టెల పొయ్యిల వైపు అడుగులు వేయక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
  సమజసం కాదు
మార్చి నుంచి  అన్ని ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌లపై సబ్సిడీ తొలగిస్తామని ప్రకటించడం సమజసం కాదు. ఇప్పటికే సిలిండర్‌ పొందాలంటే  సబ్సిడీ సోమ్ము కలిపి  చెల్లించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సిలిండర్‌పై నెలకు రూ.4ల చొప్పున ధర పెంచడం పేదలపై మరింత భారం పడుతుంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీ కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటనపై స్పదించకపోవడం బాధాకరం.
 
తానేటి వనిత, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొవ్వూరు
 
 
 
 
ఇబ్బందే 
గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి పూర్తిగా ఎత్తి వేస్తామని చెప్పడం సరికాదు.  మహిళలు చాలా బ్బంది పడాల్సి వస్తోంది. సిలిండర్‌కు  రూ.4 చొప్పున పెంచుతామని చెప్పడం కూడా తగదు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.
 కావూరి కుమారి, మహిళా సర్పంచ్‌  వేగేశ్వరపురం 
 
 
 
 
 
 
 
 
 
 
మరిన్ని వార్తలు