సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం అద్భుతం

3 Sep, 2016 23:25 IST|Sakshi
సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం అద్భుతం

చిలమత్తూరు : సేంద్రీయ పద్ధతుల ద్వారా పంటలు, మొక్కలు సాగు చేయడం, భూగర్భ జలాలను కాపాడుకోవడం అద్భుతమని దక్షిణాఫ్రికా హైకమిషనర్‌ ఎఫ్‌కే మొరాలీ పేర్కొన్నారు. ఇలాంటి పద్ధతులను దక్షిణాఫ్రికాలోనూ అమలయ్యేలా ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. డెక్కన్‌ వాటర్‌ హార్‌వెస్టింగ్‌ సంస్థ (హైదరాబాద్‌) ప్రతినిధులు అయ్యప్ప, వి.ప్రకాష్, సుబ్బారావు, శివకుమార్, సోమశేఖర్‌రెడ్డి పిలుపుమేరకు ఆయన శనివారం చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ సుబ్బరావుపేట సమీపంలో సేంద్రీయ పద్ధతులతో సాగు చేస్తున్న తోటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు అయ్యప్ప పలు అంశాలను ఆయనకు వెల్లడించారు. 75 ఎకరాల పొలంలో మహాగని, హెర్బల్, కొండవేప తదితర మొక్కలను సుమారు 25 వేలు సాగు చేశామన్నారు. ప్రతి మొక్కకు నీరు తడవడానికి కందకాలు తవ్వినట్టు వివరించారు. రసాయనిక ఎరువులు వాడకుండా జీవామతంతోనే మొక్కలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సాగు చేసిన టమాట, ముల్లంగి తదితర పంటలను కూడా ప్రదర్శించారు. ఈ విషయాలను గమనించిన కమిషనర్‌ మొరాలీ మాట్లాడుతూ ఇలాంటి కరువుఛాయలు దక్షిణాఫ్రికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. ఆ ప్రాంతాల్లో ఇలాంటి పద్ధతులను అవలంభించడానికి అక్కడి ప్రధానితో చర్చిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రామకష్ణారెడ్డి, పురుషోత్తమ్‌రెడ్డి, హనుమంతరెడ్డి, విష్ణు, వీరప్ప తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు