అయ్యా.. రౌడీషీటర్ గారూ..

13 Dec, 2015 01:12 IST|Sakshi
అయ్యా.. రౌడీషీటర్ గారూ..

- అమలాపురం పోలీసుల రివర్స్ ఎటాక్
 
అమలాపురం టౌన్:
ఓ రౌడీషీటర్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఝలక్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు. ఆ రౌడీషీటర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై ఆయనో రౌడీ అంటూ మరో ఫ్లెక్సీ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు.

అమలాపురంలో ఆరు రౌడీ గ్యాంగ్‌లున్నాయి. దానిలో కొలగాని స్వామినాయుడు ఎలియూస్ నాయుడుపై కూడా రౌడీషీట్ ఉంది. శనివారం అతని పుట్టినరోజు కావడంతో అతని అనుచరులు పట్టణంలో 22 చోట్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే విధంగా గడియారంస్తంభం సెంటర్లో, అందునా మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న ట్రాఫిక్ ఐల్యాండ్‌పై భారీ సైజులో నాయుడు ఫ్లెక్సీ పెట్టటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.

 అదే ఫ్లెక్సీపై ‘రౌడీషీటర్ గారు శ్రీ కొలగాని నాయుడు గారు... ఇట్లు అమలాపురం టౌన్ పోలీసు’ అని రాసి ఉన్న చిన్న ఫ్లెక్సీలను అతికించారు. ఒకపక్క క్రికెట్ బ్యాట్, మరోపక్క నెత్తురుతో ఉన్న కత్తి బొమ్మలను ఆ ఫ్లెక్సీపై ముద్రించారు. పోలీసుల చర్య పట్టణవాసుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఇటీవల రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. ఆ చర్యల్లో భాగంగానే ఈ రివర్స్ ఫ్లెక్సీని పోలీసులు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు