మరోపోరాటం

28 Apr, 2017 01:50 IST|Sakshi
మరోపోరాటం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాడేందుకు ఏకతాటిపైకి వస్తున్నారు. ఇప్పటివరకూ గ్రామాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన రైతులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు కోర్టులను ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోగా.. కోర్టులకు వెళ్లలేని వారు ప్రభుత్వం చెల్లించిన అరకొర నష్టపరి హారం వల్ల నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. వీరంతా ఇకపై దశల వారీగా ఐక్య ఉద్యమాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతులు చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టు రైతుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించి.. ఈ నెల 24న తెడ్లం గ్రామంలో సమావేశమయ్యారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులందరినీ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ చట్టం ద్వారా ఉన్న హక్కులు, వారికి రావాలి్సన పరిహారం విషయంలో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు ముద్రించి అన్ని గ్రామాల్లో అతికించాలని నిర్ణయించారు. కాలం చెల్లిన జీఓ ఆధారంగా ఉద్యాన పంటలకు పరిహారం ఇస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్‌ విలువల ఆధారంగా పరిహారం పొందేందుకు హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేయాలని నిర్ణయించారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని నాలుగు రెట్లు ఇచ్చే విధంగా అధికారులతో చర్చలు జరపడంతోపాటు కోర్టుల ద్వారా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న భూములు, నివాస యోగ్యమైన స్థలాలు, వాణిజ్యపరమైన స్థలాలకు అదనపు విలువలు నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వంతో చర్చలు జరపడం.. ఆ ప్రయత్నాలు ఫలించని పక్షంలో కోర్టులను ఆశ్రయించాలని తీర్మానించారు. అసైన్‌డ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ అంశాలపై త్వరలో మరోసారి సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నారు.  
 
మరిన్ని వార్తలు