రిపోర్టర్‌పై దాడి చేసినవారిని అరెస్టు చేయాలి

6 May, 2017 00:22 IST|Sakshi
రిపోర్టర్‌పై దాడి చేసినవారిని అరెస్టు చేయాలి
కర్నూలు(న్యూసిటీ) : ఇసుక అక్రమ రవాణాపై కవరేజ్‌ చేసిన ఐ–న్యూస్‌ రిపోర్టర్‌ రామిరెడ్డిపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న, జిల్లా కోశాధికారి హుసేన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీలు, గుండాలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. మొన్న సాక్షి, నిన్న టీవీ 5, నేడు ఐ–న్యూస్‌ పాత్రికేయులపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్‌ మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుందని విమర్శించారు.   మీడియాపై జరుగుతున్న దాడుల నియంత్రణకు మహారాష్ట్ర తరహాలో మీడియా ప్రొటెక‌్షన్‌ బిల్లు తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని సీనియర్‌ పాత్రికేయులు సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు.    ధర్నాలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్మన్న, ఇస్మాయిల్, ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, వీడియో జర్నలిస్టు సంఘం కార్యదర్శి మౌలాలి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చాంద్, కోశాధికారి మధు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు