మంత్రి జోగు రామన్నపై అట్రాసిటీ కేసు

7 May, 2016 22:53 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/ఆదిలాబాద్ రూరల్: రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషించారని ఆదిలాబాద్ మండలం పిప్పల్‌ధరి పంచాయతీ మామిడిగూడకు చెందిన సిడాం ప్రసాద్ ఆదిలాబాద్ జెఎఫ్‌సీఎం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు మంత్రి రామన్నతోపాటు ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ సుభాష్‌చందర్ సహా మొత్తం 26 మందిపై కేసు నమోదు చేయాలని ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మంత్రి జోగు రామన్నతో పాటు, 26 మందిపై ఈనెల 4న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఆదిలాబాద్ రూరల్ ఎస్‌ఐ ఎల్.రాజు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు.

సబ్‌స్టేషన్ స్థల వివాదం..
ఆదిలాబాద్ మండలం పిప్పల్‌ధరి గ్రామ శివారులో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.1.65 కోట్లు మంజూరయ్యాయి. ఈ సబ్‌స్టేషన్‌ను ఈ గ్రామ శివారులోని సర్వేనెం.27/1, 29/ఏ స్థలంలో నిర్మించాలని ముందుగా భావించారు. అయితే స్థలాన్ని ఇదే గ్రామ శివారులోని మరో చోటకు మార్చి, అక్కడ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి రామన్నతో పాటు, రెవెన్యూ, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో తనను కులం పేరుతో దూషించారని ప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. ప్రసాద్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఈ కేసు నమోదు చేయాలని ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా