ఇంకెంత దూరం?

17 Dec, 2016 03:24 IST|Sakshi
ఇంకెంత దూరం?

విచారణ చేపట్టి చేతులు దులుపుకున్న అధికారులు
రెండు వారాలుగా   ఉన్నతాధికారులకు అందని నివేదిక
దీంతో మరింత రెచ్చిపోతున్న క్రషర్లు, తారు ప్లాంట్ల యాజమాన్యాలు
భయం గుప్పిట్లో  గ్రామాల ప్రజలు
మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తాం : ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్‌


హన్మకొండ: అ«ధికారుల చర్యలు సైతం రాజకీయ నాయకుల మాటల్లాగే మారిపోయాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామపంచాయతీ తీర్మానాలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్న వారి హామీలు బుట్టదాఖలు కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ మేరకు క్రషర్లు, తారు ప్లాంట్ల నిర్వాహకుల కారణంగా తమకు నష్టం జరుగుతుండగా.. అధికారులు చేపట్టిన విచారణ తోనైనా న్యాయం జరుగుతుందని ఆశ పడిన శాయంపేట మండలంలోని మాందారిపేట, మాందారిపేట, గోవిందాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక, పెద్దకోడెపాక తదితర గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రెండు వారాల క్రితం అధికారులు చేపట్టిన విచారణ నివేదిక కలెక్టర్‌కు ఇప్పటికీ అందకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారీ పేలుళ్లు.. తీవ్రమైన కాలుష్యం
వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్‌ క్రషర్లలో భారీ పేలుళ్లు, తారు ప్లాంట్ల నుంచి తీవ్ర కాలుష్యం విడుదలవుతోందని మాందారిపేట, గోవిందాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక, పెద్దకోడెపాక గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిలెటిన్‌ స్టిక్స్‌ ద్వారా రాతిగుట్టలను పేల్చేందుకు ఉన్న అనుమతులు అతిక్రమించి మరింత తీవ్రతతో పేలుళ్లు చేస్తుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సాధారణంగా కంప్రెషర్‌ వాడేందుకే అనేక రకాల అనుమతులు అనేక షరతులతో ఇస్తారు. అయితే క్రషర్ల నిర్వాహకులు మరింత ముందుకు వెళ్లి బోరు రిగ్గుల్లాంటి భారీ యంత్రాలతో డ్రిల్లింగ్‌ చేసి భారీ తీవ్రతతో పేలుళ్లు చేపడుతుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పేలుళ్ల తీవ్రత కారణంగా ఆయా గ్రామాల్లో ఇళ్లు బీటలు వారుతుండగా, మండల కేంద్రం శాయంపేట సైతం దుమ్ము, ధూళి బారిన పడుతోంది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు అనేక ఆందోళనలు చేయడంతో పాటు జిల్లా కలెక్టరు, స్పీకర్‌కు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు రావడంతో ఈనెల 2వ తేదీన ఆర్డీఓ, మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారులు, తహసీల్దార్‌ విచారణ చేపట్టారు. గ్రామాల ప్రజలు, పాఠశాలల విద్యార్థులతో పాటు మాట్లాడి ప్రమాదకర స్థాయిలో కాలుష్యం వెలువడుతోందని తెలుసుకున్నారు. అదేవిధంగా బీటలు వారిన ఇళ్లను సైతం పరిశీలించి, గ్రామపంచాయతీ తీర్మానాలను సైతం ధిక్కరించారని తేల్చారు. ఇంకా ప్లాంట్ల అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు. ఈ క్రమంలో క్రషర్లు, డాంబర్‌ ప్లాంట్ల నిర్వాహకులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు.

రెండు వారాలు గడిచినా..
అధికారులు విచారణ నిర్వహించి రెండు వారాలు దాటినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదు. దీంతో క్రషర్లలో పేలుళ్లు మరింత తీవ్రమయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో క్రషర్లు, డాంబర్‌ ప్లాంట్ల వారు మరింతగా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారని వాపోతున్నారు. దీంతో తమ పరిస్థితి దారుణంగా తయారైందని గగ్గోలు పెడుతున్నారు. రాజకీయ అండతోనే ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు