బాలమురళి పేరిట సంగీత కళాశాల

6 Jul, 2017 22:48 IST|Sakshi
బాలమురళి పేరిట సంగీత కళాశాల
శంకరగుప్తం గ్రామంలో ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం
–‘మంగళంపల్లి’ 87వ జయంత్యుత్సవంలో ఆస్థానశిల్పి రాజకుమార్‌ ఉడయార్‌
రాజమహేంద్రవరం కల్చరల్‌ : సంగీత సామ్రాజ్య సార్వభౌమ, పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట ఆయన స్వగ్రామం శంకరగుప్తం గ్రామంలో సంగీత కళాశాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్రప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజకుమార్‌ వడయార్‌ ప్రకటించారు. గురువారం డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతసభ ఆధ్వర్యంలో విక్రమ్‌హాల్లో జరిగిన మంగళంపల్లి 87వ జయంత్యుత్సవ కార్యక్రమంలో ఆయన తాను రూపొందించిన బాలమురళి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగరంలో గోదావరి గట్టుపై, ఏవీ అప్పారావు రోడ్డులోని శారదానగర్‌లో ఉన్న బాలమురళీకృష్ణ పార్కులో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తానన్నారు. సభకు అధ్యక్షత వహించిన భాగవత విరించి డాక్టర్‌ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ మహామనిషి బాలమురళి మన మధ్యలో లేకున్నా ఆయన స్వరం మన జీవితాలను పండిస్తూనే ఉంటుందన్నారు. పిల్లలకు బాలమురళి కీర్తనల పోటీలు నిర్వహించాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిత్యవిద్యార్థి డాక్టర్‌ కర్రిరామారెడ్డిని ‘పుంరూప శారద’ బిరుదుతో సంగీతసభ తరఫున డాక్టర్‌ టి.వి.నారాయణరావు సత్కరించారు. కర్రి రామారెడ్డి మాట్లాడుతూ ఎన్నో డిగ్రీలు తీసుకున్న తాను ఈ సారి సంగీతంలో సర్టిఫికెట్‌ కోర్సు చేస్తున్నానని వెల్లడించారు. కొన్ని శాస్త్రీయ రాగాలు వినడం వలన మధుమేహ లక్షణాలు తగుగ్తాయని, గర్భిణులు మంచి సంగీతాన్ని వింటే, పుట్టిన బిడ్డలకు మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందన్నారు. అనంతరం విజయనగరం సంగీత కళాశాల అధ్యాపకుడు బి.ఏ.నారాయణను ‘మురళీమనోజ్ఞ సంగీత రత్నాకర’ బిరుదుతో నిర్వాహకులు సత్కరించారు. బీఏ నారాయణ గాత్రకచేరీ శ్రోతలను అలరించింది. పాత్రికేయుడు వీఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌ స్వాగత వచనాలు పలికారు. సంగీతసభ వ్యవస్థాపకుడు సాగి శ్రీరామచంద్రమూర్తి, వి.శేషగిరి వరప్రసాద్, వాడ్రేవు మల్లపరాజు, సంగీతాభిమానులు తదితరులు హాజరయ్యారు. 
మరిన్ని వార్తలు