నడిరోడ్డుపై యాచకురాలు ప్రసవం

7 Jul, 2017 07:05 IST|Sakshi
నడిరోడ్డుపై యాచకురాలు ప్రసవం
– కవల పిల్లల జననం
- కర్నూలులో ఘటన
- ఆలస్యంగా వెలుగులోకి..
 
కర్నూలు (హాస్పిటల్‌):  కర్నూలు నగరంలోని రాజ్‌విహార్‌ సెంటర్‌ వద్ద భిక్షాటన చేసుకుని జీవించే ఓ మహిళ అదే ప్రాంతంలోని రహదారిపై ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ  ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె అనాథగా జీవిస్తుండటం, అప్పటికే ఓ కూతురు ఉండటం, తాజాగా జన్మించిన కవలలు బరువు తక్కువగా ఉండటంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను, పిల్లలను శిశుగృహకు తరలించారు. కర్నూలు నగరంలోని బంగారుపేట ప్రాంతానికి చెందినదిగా భావిస్తున్న జానకి కొంత కాలంగా రాజ్‌విహార్‌ సెంటర్‌లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెతో పాటు రెండేళ్ల వయస్సున్న కూతురు కూడా ఉంది. కూతురును చూపించి భిక్షాటన చేస్తోందంటూ గతంలో ఫిర్యాదు రావడంతో ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినా ఆమె వృత్తిని మానుకోలేదు.
 
ఇదే సమయంలో ఆమె గర్భం దాల్చి ఐదురోజుల క్రితం రాజ్‌విహార్‌ సెంటర్‌లోనే నడిరోడ్డుపై మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. గురువారం ఆమె రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండటం, పిల్లలు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీసులు ఆమె పరిస్థితి గురించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్‌) అధికారి జుబేదాబేగంకు సమాచారమిచ్చారు. దీంతో ఐసీడీఎస్‌ అర్బన్‌ సీడీపీవో వరలక్ష్మి, ఐసీపీఎస్‌ డీసీపీవో శారద, సోషల్‌ వర్కర్‌ నరసింహులు, అవుట్‌రీచ్‌ వర్కర్‌ రాజు వెళ్లి  నడిరోడ్డుపై ఉన్న బాలింత జానకి, ఆమె పిల్లలను  సి.క్యాంపులోని శిశుగృహకు తరలించారు.
 
అనంతరం బరువు తక్కువగా ఉన్న కవల పిల్లలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో చేర్పించారు. కాగా.. తనకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు జానకి నిరాకరిస్తోంది. తనకు ఎవ్వరూ లేరని, తనను వదిలిపెట్టండని అధికారులను ప్రాధేయపడుతోంది.
మరిన్ని వార్తలు