గోదావరి నదిలో పడవ బోల్తా

22 Feb, 2016 03:49 IST|Sakshi
గోదావరి నదిలో పడవ బోల్తా

నలుగురు గల్లంతు
♦ బోట్ సిబ్బంది సహా 22 మంది సురక్షితం
♦ మహారాష్ట్ర-తెలంగాణ అంతర్రాష్ట్ర వంతెనవద్ద ప్రమాదం
 
 కాళేశ్వరం: కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం మెట్‌పల్లి వద్ద నిర్మిస్తున్న అంతర్రాష్ట్ర వంతెన వద్ద పర్యాటక స్టీమర్(పడవ) బోల్తా పడి నలుగురు గల్లంతయ్యారు. 22 మంది సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చింతలపల్లి మహదేవపూర్ మండలం మెట్‌పల్లిని కలుపుతూ గోదావరి నదిపై వంతెన నిర్మిస్తున్నారు. వంతెన పనుల కోసం తాత్కాలికంగా రహదారి కూడా నిర్మించారు. గోదావరికి అటూ ఇటూ ఉన్న గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి తాత్కాలిక రహదారిపైనుంచి గోదావరి దాటుతుంటారు. ఇటీవల గోదావరికి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో వంతెన పనులు చేసే నిర్వాహకులు... ఆదివారం తాత్కాలిక రహదారివైపు నీళ్లు రాకుండా కాలువలా చేసి నీటిని మళ్లించారు.

ఈ నేపథ్యంలో కాళేశ్వరం వద్ద గోదావరిపై పడవ ద్వారా ప్రయాణికులను అటూ ఇటూ చేరవేసే గంగపుత్రులు ఆదివారం ఈ తాత్కాలిక వంతెన వద్ద ప్రయాణికులను చేరవేసేందుకు వచ్చారు. సాయంత్రం 20 మంది ప్రయాణికులు, పడవ నడిపేవారు ఆరుగురితో కలిపి మొత్తం 26 మందితో వంతెన వద్ద నుంచి మెట్‌పల్లికి పడవలో బయలుదేరారు. వంతెన కింది భాగంలో వెల్డింగ్ పనులు నడుస్తుండడంతో జనరేటర్ వైర్ నీటిలో పడవకు అడ్డు తగిలింది. దీంతో పడవ అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్నవారంతా నీళ్లలో పడిపోయారు. మూడు బైక్‌లు సైతం మునిగిపోయాయి.

గంగపుత్రులు వెంటనే నీళ్లలో దూకి పలువురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. క్షేమంగా బయటపడ్డవారిలో మాలే విష్ణు (సిరొంచా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వ్యక్తి), ఆలం కాజల్, శ్రీరాం పార్వతి (సిరొంచా), నేలటూరి భాగ్య (పరకాల), ధర్మపురి నరేష్, అతడి భార్య అలేఖ్య (నిండుగర్భిణి), శశికళ, అరుణ్ (జగిత్యాల), మతిన్ (సిరొంచా), ఊదరి వినయ్, ఊదరి సమ్మక్క దంపతులు, వీరి కుమారుడు చరణ్ (6), మారగోని జ్యోతి, ఆమె బావ కూతురు శ్రేయశ్రీ (5) (ఆసరెళ్లి), బుర్రి లక్ష్మి ఆమె పది నెలల కూతురు ఉన్నారు. పాప అస్వస్థతకు గురికావడంతో గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాటారం మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుర్రి వంశీ (11) గల్లంతయ్యాడని అతడి బంధువులు తెలిపారు. వంశీతోపాటు మరో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సిరొంచా డీఎస్పీ శివాజీ పవార్, మంథని ఆర్డీవో బాలె శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రవి, ఎస్సైలు కృష్ణారెడ్డి, రమేశ్, వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు