డెలి‘వర్రీ’

21 Aug, 2017 02:11 IST|Sakshi
డెలి‘వర్రీ’

‘బర్త్‌ప్లాన్‌’ లేక తప్పని ప్రసవ వేదన
క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షణ శూన్యం
పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ
సర్వజనాస్పత్రిలోనూ ఆగని గర్భిణుల ఘోష
తాజాగా ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవం
మూడ్రోజుల క్రితం బాలింత మృత్యువాత



⇒26,284 :  2016–17లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాలు
⇒4,440 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన సిజేరియన్లు
⇒63 : గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమైన 42 రోజుల్లోపు మృతి చెందిన వారి సంఖ్య
⇒830 : ప్రసవం తర్వాత ఏడాదిలోపు మృత్యువాత పడిన శిశువులు
⇒1159 : కడుపులోనే మృతి చెందిన శిశువులు

పెద్దవడుగూరుకు చెందిన ఈమె పేరు అమీన్‌. ఈనెల 17వ తేదీన ప్రసవం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. కనీసం బెడ్‌ కూడా ఇవ్వలేదు. దీంతో రెండ్రోజుల నుంచి ఆరు బయటే ఉంటోంది. శనివారం అర్ధరాత్రి దాటాక నొప్పులొచ్చాయి. లేబర్‌ రూంకు తీసుకెళ్దామనుకునేలోపే ఆదివారం తెల్లవారుజామున ఆరుబయటే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వార్డులోకి తీసుకెళ్లి తల్లీబిడ్డకు వైద్యం అందించారు. పెద్దాస్పత్రిలో గర్భిణులకు ఎలాంటి వైద్యం అందుతోందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన రాజేశ్వరి ఈనెల 12న రెండో కాన్పుకోసం సర్వజనాస్పత్రికి వచ్చింది. అదే రోజు సిజేరియన్‌ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు నుంచి కడుపు ఉబ్బరంగా ఉండడంతో పాటు రక్తస్రావం ఆగకపోవడంతో మళ్లీ ఆపరేషన్‌ చేశారు. చివరకు మూడ్రోజుల క్రితం ఆమె మృత్యువాతపడింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందన్న వాదనలున్నా వాస్తవానికి ఈమె గర్భం దాల్చినప్పటి నుంచి ‘బర్త్‌ప్లాన్‌’ సరిగా లేదు. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం గాల్లో కలిసింది.

అనంతపురం మెడికల్‌ :   మాతాశిశు సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంతో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ‘బర్త్‌ప్లాన్‌’ సరిగా లేకపోవడం, ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంటోంది. మరోవైపు జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో గర్భిణులు ప్రసవ వేదన అనుభవిస్తున్నారు. సరిపడా పడకలు లేవన్న కారణంతో అక్కడి సిబ్బంది నిండు గర్భిణులను కూడా నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటేస్తున్నారు. ఫలితంగా ప్రసవాలు ప్రమాదభరితంగా మారుతున్నాయి.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు
నిబంధనల ప్రకారం ఓ మహిళ గర్భం దాల్చిన ఏడవ నెల నుంచి తప్పనిసరిగా ఏఎన్‌ఎంలు గర్భిణి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు ఆరా తీసి  వాటిని ఎంసీపీ (మదర్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌) కార్డులో నమోదు చేయాలి. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. హై రిస్క్‌ (రక్తహీనత) ఉన్నట్లు తేలితే క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. 108 వాహనానికి ముందే సమాచారం ఇచ్చి ఉండాలి. ప్రసవానికి వారం ముందు ఈడీడీ (ఎక్స్‌పెక్టెడ్‌ డేట్‌ ఆఫ్‌ డెలివరీ) తెలుసుకుని ఐదు రోజుల ముందు ఆస్పత్రిలో అడ్మిషన్‌ చేసేలా చూడాలి. సాధారణంగా ప్రసవ సమయానికి 10 ఎంజీ కన్నా ఎక్కువగా హిమోగ్లోబిన్‌ ఉండాలి. 6 ఎంజీ లోపల ఉంటే తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. 8 నుంచి 10 ఎంజీ మధ్యలో ఉంటే ఐరన్‌ సిప్రోజ్‌ ఇంజెక్షన్లు (మూడు నుంచి నాలుగు) వేయించేలా చూడడంతో పాటు ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలు ఉదయం, రాత్రి వేసుకునేలా చేయాలి. కానీ ఇవేవీ వైద్య ఆరోగ్యశాఖకు పట్టడం లేదు.

జిల్లాలో ఒక బోధనాస్పత్రి, ఒక జిల్లా కేంద్ర ఆస్పత్రి, 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు ఉండగా వీటిలో గర్భిణులకు సంతృప్తికర సేవలు అందడం లేదు. సబ్‌ సెంటర్లలో కూడా గర్భిణులపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉన్నా నామమాత్రంగా సేవలు అందుతున్నాయి. అసలు ఏఎన్‌ఎంలు గ్రామాల్లో అందుబాటులో ఉండడం లేదు. పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరం. నెలవారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు అందించాల్సి ఉన్నా... క్షేత్రస్థాయిలో సక్రమంగా ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రసవ సమయంలో గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏటా మరణాలు పెరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలు చేయడం మినహా క్షేత్రస్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోతోంది.


సర్వజనాస్పత్రిలో మరీ ఘోరం
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఒకలా ఉంటే ప్రసవం కోసం సర్వజనాస్పత్రికి వచ్చే వారు అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. సిజేరియన్లు చేయాల్సి వస్తే ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక్కడి ఈఓటీ (ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌)లో నిత్యం 10కి పైగా సిజేరియన్లు జరుగుతుంటాయి. వీటికి తోడు అపెండిక్స్, సర్జికల్‌ కేసులు, ఈఎన్‌టీ కేసులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ రెండు ‘టేబుల్స్‌’ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర కేసులు ఎలా ఉన్నా గర్భిణులు మాత్రం నరకయాతన పడాల్సి వస్తోంది. నొప్పులతో ఆర్తనాదాలు చేయాల్సి వస్తోంది. మూడ్రోజుల క్రితం గుత్తికి చెందిన లావణ్యకు సిజేరియన్‌ అవసరం కావడంతో ఈఓటీ వద్దకు తెచ్చారు. ఆపరేషన్‌ టేబుల్స్‌ ఖాళీగా లేకపోవడంతో బయట ఓ గదిలో కూర్చోబెట్టి సెలైన్‌ బాటిల్‌ ఎక్కించి అలాగే వదిలేశారు. ఈ క్రమంలో నొప్పులు భరించలేక ఆమె నరకయాతన అనుభవించింది. ప్రధానంగా ఇక్కడి ఆంటినేటల్‌ వార్డులో గర్భిణులు అవస్థలు పడుతున్నా జిల్లా యంత్రాంగానికి పట్టడం లేదు. వైద్యుల తీరూ తీసికట్టుగా ఉంటోంది.

మరిన్ని వార్తలు