ఆటంకాలే

12 Dec, 2016 15:07 IST|Sakshi
ఆటంకాలే
గ్రిగ్‌పోటీలకు దక్కని బాసట
ప్రభుత్వం నుంచి నిధులు లేవు
జెడ్పీ నుంచి దక్కని చేయూత
పెద్దనోట్లకు చిల్లరి లేదు
భారంగా మారిన జోనల్‌ గ్రిగ్‌ పోటీలు 
అమలాపురం : పాఠశాల స్థాయిలో జరిగే జోనల్‌ గ్రిగ్‌ పోటీలకు నిధులు కొరత పట్టిపీడిస్తోంది. ఈ పోటీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందలేదు. గతంలో జెడ్పీ నుంచి మైదానం అభివృద్ధికి వచ్చిన నిధులు కూడా నిలిచిపోయాయి. దాతల సహాయం తీసుకుందామన్నా.. పెద్దనోట్లు పెద్ద సమస్యగా మారాయి. దీంతో పోటీల నిర్వహణ ప్రహసనమైంది. 
జెడ్పీ మొండి చేయి చూపడంతో..
పాఠశాల స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే గ్రిగ్‌ పోటీలు జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆరంభమయ్యాయి. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ రెండు నుంచి ప్రారంభం కావల్సి ఉండగా, నిర్వహణ భారం మోయలేక కొన్ని పోటీలను ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు నిధుల కొరత పట్టిపీడిస్తోంది. పోటీల నిర్వహణకు జోన్‌ స్థాయిలో రూ.మూడు లక్షలు, సెంట్రల్‌ జోన్‌ పోటీలకు రూ.రెండు లక్షలు ఖర్చవుతోంది. తొలి నుంచి పోటీలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లేదు. పోటీల్లో పాల్గొనే ఆయా పాఠశాలలు ఎంట్రీ ఫీజులు, అప్లికేషన్‌ ఫీజులు చెల్లించే రుసుమునే ఆయా పాఠశాలలకు రూ.పది వేల చొప్పున కేటాయిస్తున్నారు. గతంలో మైదానాల అభివృద్ధి పేరుతో జిల్లా పరిషత్‌ రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది జెడ్పీ కూడా మొండిచేయి చూపించింది. దీంతో పోటీల నిర్వాహకులు దాతలు అందించే సహాయంపైనే పూర్తిగా ఆధారపడ్డారు. తీరా నోట్ల రద్దుతో పెద్దనోట్లు మారకపోవడం, చిల్లరి నోట్లు దొరకక నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. కొత్తనోట్లు లేకపోవడం, పాతనోట్లు తీసుకోకపోవడంతో పోటీలు నిర్వహించలేకపోతున్నారు. అమలాపురం జోన్‌ బాలుర గ్రిగ్‌ పోటీలు ఈ ఏడాది అయినవిల్లి మండల కొండుకుదురుకు కేటాయించారు. నిర్వహణ భారమైనా పోటీలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజోలు, రామచంద్రపురం, రంపచోడవరం, తుని, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం జోన్లలో బాలురు, బాలికల క్రీడాపోటీల నిర్వహణకు సైతం ఇవే ఇబ్బందులున్నాయి. 
పక్కదారినపడుతున్న ఖేల్‌రత్న నిధులు 
మూడు, నాలుగు రోజుల పాటు వందల మంది విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించే గ్రిగ్‌ పోటీల నిర్వహణకు నిధులు లేవు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తయ్యే ఖేల్‌రత్న(గతంలో పైకా) పోటీలకు మాత్రం నిధులిస్తున్నారు. మండల స్థాయిలో రూ.30 వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.40 వేలు ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో విజేతలకు రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకువెళుతున్నారు. కేటాయిస్తున్న నిధులను చాలా మంది ఎంపీడీఓలు నొక్కేస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఇలా అవసరమైన చోట నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చిన చోట సద్వినియోగం కాకపోవడం పాఠశాల స్థాయి క్రీడాకారులకు శాపంగా మారింది. 
ప్రత్యేకంగా నిధులివ్వాలి
పాఠశాలల్లో క్రీడా పోటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. నిర్వహణకు లక్షల్లో ఖర్చుపెట్టడం చాలా కష్టంగా ఉంది. ఖేల్‌రత్నకు ఇస్తున్నట్టుగా జోనల్‌ గ్రిగ్‌ పోటీలకు సైతం ప్రభుత్వం నిధులివ్వాలి. 
– ఉండ్రు ముసలయ్య, అమలాపురం జోన్‌ వ్యాయామోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు.
మరిన్ని వార్తలు