నిఘా నీడలో ఈరన్న క్షేత్రం

26 May, 2017 22:50 IST|Sakshi
నిఘా నీడలో ఈరన్న క్షేత్రం
- ఉరుకుంద భక్తులకు కట్టుదిట్టమైన భద్రత
- రూ.4.80 లక్షలతో డిజిటల్‌ సీసీ కెమెరాల ఏర్పాటు
- 37 సీసీ కెమెరాలు.. 42 ఇంచుల మానిటర్‌ అమరిక 
 
మంత్రాలయం: ఎట్టకేలకు ఈరన్న క్షేత్రం అధికారులు మేలుకొన్నారు. భద్రత రీత్యా నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రంలో ఒక్కరి ప్రతి కదలికపై నిఘా పెంచారు. అందుకోసం రూ.4.80 లక్షలుపైగా వెచ్చించారు. భక్తుల దోపిడీ మొదలు ప్రమాదకర శక్తులను పనిపట్టేందుకు నిఘానేత్రాలు తప్పనిసరి. ఏటా శ్రావణమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసంలోని ప్రత్యేక రోజులు సోమవారం, గురువారాల్లో భక్తులు లక్షలాదిగా స్వామి క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉగాది, గద్వాల పూర్ణిమ, అమావాస్య, సోమవారాల్లోనూ భక్తుల రద్దీ ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా స్వామి భక్తులు ఉన్నారు. ఏటేటా ఈరన్నస్వామి భక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.
 
క్షేత్రం భద్రత రీత్యా అధికారులు నిఘాపై దృష్టి కేంద్రీకరించారు. గతంలో ఆలయంలో 12 సీసీ కెమెరాలతో నిఘాను నెట్టుకొచ్చారు. కౌతాళం ఎస్‌ఐ సుబ్రమణ్యంరెడ్డి సూచన మేరకు ఈవో మల్లికార్జున ప్రసాద్‌ నిఘా పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. రూ.4.80 లక్షలు వెచ్చించి సీపీప్లస్‌ కంపెనీకి చెందిన 37 డిజిటల్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గర్భాలయంలో 5, ధ్వజస్తంభ క్యూలైన్‌తో 02, క్యూలైన్‌ ఎదురుగా 02, టిక్కెట్‌ కౌంటర్‌ 02, క్యూలైన్‌ షెడ్‌లో 02, అన్నదాన సత్రంలో 04, ఆలయ కార్యాలయం ఎదుట 01, క్యూలైన్‌ ఎగ్జిట్‌లో 02, ఆదోని, మంత్రాలయం, ఉరకుంద గ్రామ ము«ఖద్వారాలతో 03, షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఏరియాలో 01, మిగతా కెమెరాలు ఆలయ ప్రాకారాలు, ఓపెన్‌ ప్రదేశాల్లో అమర్చారు. ఆఫీస్‌లో 40 ఇంచుల మానిటర్‌ టీవీ (నిల్వ సామర్థ్యం 12,000 జీబీ)లో  కెమెరాల దృశ్యాలను అనుసంధానం చేస్తారు. 
 
కెమెరాల ప్రత్యేకత :
సాధారణ కెమెరాల కంటే మెరుగైన టెక్నాలజీ డిజిటలైన్‌ కెమెరాలు ఇవీ. అల్యూమినియం మెటల్‌తో తయ్యారు చేయబడినవి. నీళ్లలో తడిచినా పనిచేయగలవు. చీకటిలోనూ చాలా క్లారిటీగా వీడియో దృశ్యాలు చిత్రీకరిస్తాయి. సాధారణ కెమెరాలు కేవలం 20 మీటర్లు దూరం వరకు మాత్రమే దృశ్యాలను కాస్త క్లారిటీగా తీయగలవు. ఇవీ మాత్రం 60 మీటర్ల మేర క్లారిటీతో వీడియో దృశ్యాలు చిత్రీకరించగలవు. 
 
అక్కడెందుకు మినహాయించారో :
క్షేత్రం దర్శించిన భక్తులు దాదాపుగా తలనీలాలు సమర్పిస్తారు. కల్యాణకట్టతో భక్తులు ఏటా దోపిడీకి గురవుతున్నారు. టిక్కెట్‌ కాదని, గుండుకో రేటు పెట్టుకుని నిలువు దోపిడీ సాగిస్తున్నారు. అందులో అధికారులు మొదలు వాటాలు ఉన్నవే. హుండీ ఆదాయం పక్కతోవ పడుతోందని ఎన్నోసార్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. హుండీ లెక్కింపు భవనంలో పాత కెమెరాలకు పరిమితం చేశారు. భక్తులు నిలువుదోపిడీ గురవుతున్న కల్యాణకట్ట, హుండీ ఆదాయం అడ్డదారిలో పోతోందన్న ఆరోపణలు ఉన్న లెక్కింపు భవనాలను ఎందుకు విస్మరించారో తెలియని వైనం. ఏదీ ఏమైనా క్షేత్రం భద్రతకై అధికారులు చర్యలు తీసుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
భక్తుల భద్రతే ముఖ్యం : సుబ్రమణ్యంరెడ్డి, ఎస్‌ఐ, కౌతాళం
భక్తుల భద్రత కోసమే క్షేత్రంలో నిఘాను పెంచాం. కల్యాణకట్టలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తాం. శ్రావణ మాసంలో స్నానపు ఘాట్లతో భక్తులు సొమ్ము దోపిడీకి గురికాకుండా ఇప్పటికే సీసీ కెమెరాలు నిల్వ ఉంచుకున్నాం. ముఖ్యంగా భక్తుల సొమ్ము దారి మళ్లకుండా చూస్తాం. భక్తుల సొమ్ము భక్తుల సౌకర్యాలు కేటాయించాలన్నదే మా ఉద్దేశం. ఇటీవల హుండీ కౌంటింగ్‌ సమయంలో స్వతహాగా ఖర్చుపెట్టుకుని వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేయించాం. భక్తుల సౌకర్యార్థం ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎండోమెంట్‌ అధికారులకు లేఖలు రాశాం. మహిళా భక్తులకు బాత్‌రూమ్‌లు, భక్తులు బసచేసేందుకు డార్మిటరీలు కావాలని కోరాం. వేసవి దృష్ట్యా భక్తులకు నీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించాం.    
 
మరిన్ని వార్తలు