‘మల్లన్న సాగర్’పై న్యాయపోరాటం

4 Jun, 2016 03:27 IST|Sakshi
‘మల్లన్న సాగర్’పై న్యాయపోరాటం

తొగుట: చట్టబద్ధత లేని జీఓలతో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఏటిగడ్డ కిష్టాపూర్, వేములగాట్‌లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం సంఘీభావం తెలిపిన ప్రసంగించారు. తడ్కపల్లి వద్ద 1.5 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించాల్సిన రిజర్వాయర్‌ను కుట్ర పూరితంగా తొగుటకు తరలించారని ఆరోపించారు. రీ డిజైన్ పేరుతో అన్యాయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మల్లన్న సాగర్‌కు శాస్త్రీయత లేదని స్పష్టం చేశారు.

జాతీయ హోదా కోసం మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి గ్రామాలను ముంపునకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వ తీసుకొచ్చిన 123. 214 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి గ్రామాలు మునిగిపోకుండా ప్రజలను, గ్రామాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్రతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేయడంలో ప్రతిపక్షాల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, గ్రామ సర్పంచ్ దాతారు సునందబాయి తదితరులు పాల్గొన్నారు.

 గ్రామాన్ని కాపాడుకునేందుకే దీక్షలు
కొండపాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి తమ గ్రామాన్ని కాపాడుకునేందుకే దీక్షలు చేపట్టినట్లు ఎర్రవల్లి గ్రామ ప్రజలు తెలిపారు. శుక్రవారం పలువురు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ నర్సింలు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టామని వివరించారు. వీరికి మద్దతుగా వృద్ధులు అనాజి పోశవ్వ, తూర గంగవ్వ, సాకం ఐలవ్వ, గౌండ్ల భూమవ్వ, బక్క అక్కవ్వ దీక్షలో కూర్చున్నారు. సీపీఐ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈసందర్బంగా వృద్ధులు మాట్లాడుతూ ప్రాణాలు పోయినా మల్లన్న సాగర్ ప్రాజెక్టులో తమ గ్రామం మునిగి పోకుండా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, రాంరెడ్డి, మల్లారెడ్డి, సత్తయ్య, నర్సింలు, నాగరాజు, కిషన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 ‘మల్లన్న సాగర్’ నిర్మాణం తగదు: చాడ
కొండపాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ చేపట్టడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. 70, 80 శాతం మంది ప్రజల ఆమోదయోగ్యం లభించినప్పుడే నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లిలో చేపట్టిన మల్లన్నసాగర్ ముంపు బాధితుల రిలే నిరాహార దీక్షకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండానే ఒకేచోట 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలని చూడటం దారుణమన్నారు. తడ్కపల్లి వద్ద ఒక్క టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు పునరావాస ప్యాకేజీ ఇచ్చాకే భూసేకరణ చేయాలని చాడ డిమాండ్ చేశారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు