ఊద్యమాలకు చాకలి ఐలమ్మ ఊపిరి

10 Sep, 2016 20:25 IST|Sakshi
ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి హరీశ్‌రావు
  • ఆమె జీవితం స్ఫూర్తిదాయకం
  • రూ. 20 లక్షలతో సిద్దిపేటలో స్మారక భవనం
  • రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
  • సిద్దిపేట రూరల్‌: ఉద్యమాలకు ఊపిరి పోసి ఎన్నో పోరాటాలు చేసిన చాకలి ఐలమ్మను మరువలేమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చాకలి ఐలమ్మ 31వ వర్ధంతిని పురస్కరించుకోని శనివారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో ఆమె విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శప్రాయమని, తెలంగాణ కోసం ఆమె పోరాడిన స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు.  

    వరంగల్‌ జిల్లా పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి చాకలి ఐలమ్మ మార్కెట్‌ కమిటీగా తానే నామకణం చేశానని గుర్తుచేశారు. అలాగే త్వరలో సిద్దిపేటలో రూ. 20 లక్షలతో ఐలమ్మ స్మారక భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆమె పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.

    చంద్లాపూర్‌కు రూ. 1.92 కోట్లు
    చంద్లాపూర్‌ గ్రామాన్ని దశల వారిగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ కింద రూ. 1.92 కోట్లతో గ్రామంలో తాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు. పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు 1.50 లక్షల లీటర్లు, 40 వేల లీటర్లు, 20 వేల లీటర్ల వాటర్‌ ట్యాంకుల నిర్మాణం గ్రామంలో చేపడుతున్నామన్నారు. ఈ సంవత్సరంలోనే చంద్లాపూర్‌లో ఇంటింటికి తాగునీరందేలా  చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

    అంతకు ముందు చంద్లాపూర్‌ గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం రంగనాయక సాగర్‌ ముంపునకు గురవుతుండడంతో గ్రామ గౌడ సంఘం ప్రతినిధులకు రూ.12 లక్షల చెక్కును పరిహారం కింద మంత్రి అందించారు. మంత్రి వెంట జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమల, సర్పంచ్‌ మంగమ్మ, ఎంపీటీసీ ఆరుణ, నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, బాల్‌రెడ్డి, ఒర్రెల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు