రైతుల నోట్లో మట్టికొట్టారు: వైఎస్ జగన్

8 Jan, 2016 19:04 IST|Sakshi
రైతుల నోట్లో మట్టికొట్టారు: వైఎస్ జగన్

బత్తులపల్లి: చంద్రబాబు పరిపాలన అంతా మోసం, మోసం, మోసం అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక తొంగలో తొక్కారని ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా బత్తులపల్లిలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీయిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే రుణాలు కాదు కనీసం వడ్డీలు కూడా మాఫీ చేయలేదని అన్నారు. రుణాలు కట్టని రైతుల నుంచి 14 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కరువు మండలాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 100 మంది రైతులు చనిపోయినా చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీ వేదికగా రైతు సమస్యలపై చంద్రబాబును గట్టిగా నిలదీశామని చెప్పారు. చంద్రబాబుకు బుద్ధి రావాలంటే ప్రజలంతా కలిసిపోరాడాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు